సరిహద్దు వీరులకు ఘన నివాళి.. సైనికులకు ఆత్మీయ సత్కారం

శ్రీనగర్ చౌరస్తాలో దేశభక్తి వెల్లువ.. జాతీయ జెండా నీడలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
“సైనికుల త్యాగాలే మన స్వేచ్ఛకు బలమైన పునాది” – ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
యూనిఫాం ధరించిన ప్రతి సైనికుడి సేవ దేశానికి గర్వకారణ షాద్ నగర్ ఎమ్మెల్యే పీర్లపల్లి శంకర్
నమస్తే భారత్ షాద్‌నగర్, ఆగస్టు 15:
దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతూ, కుటుంబాలకు దూరంగా ఉంటూ మాతృభూమి రక్షణ కోసం జీవితాలను అంకితం చేసిన సైనికులను గౌరవించే అరుదైన ఘట్టం షాద్‌నగర్ పట్టణంలోని శ్రీనగర్ చౌరస్తాలో ఆవిష్కృతమైంది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 18వ వార్డు కౌన్సిలర్ జమాల్‌పూర్ సంతోషి చందులాల్, ఠాగూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు దేశభక్తి భావాన్ని చాటిచెప్పాయి.
కార్యక్రమానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ రక్షణలో సేవలందించిన రిటైర్డ్ ఆర్మీ అధికారులు, మాజీ సైనికులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు.
“సైనికుల త్యాగాలను ఎన్నటికీ మరువకూడదు” – వీర్లపల్లి శంకర్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉండటం వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని అన్నారు.
“దేశం కోసం యూనిఫాం ధరించిన ప్రతి సైనికుడి సేవ చిరస్మరణీయం. ఎండ, వాన, చలి, ప్రతికూల పరిస్థితులను సైతం లెక్కచేయకుండా సరిహద్దుల్లో విధులు నిర్వర్తించిన వారి త్యాగాల వల్లే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. సైనికులను గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించడమే” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రిటైర్డ్ అయిన తర్వాత కూడా సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మాజీ సైనికుల సేవలను ఆయన అభినందించారు. యువత దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని సైనికుల నుంచి నేర్చుకోవాలని సూచించారు.
దేశభక్తి నినాదాలతో మార్మోగిన శ్రీనగర్ చౌరస్తా
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం “భారత్ మాతాకీ జై”, “వందే మాతరం” వంటి దేశభక్తి నినాదాలతో శ్రీనగర్ చౌరస్తా మార్మోగింది. చిన్నారులు, యువత, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.
18వ వార్డులో ప్రత్యేకంగా నిలిచిన సైనికుల సన్మానం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రిటైర్డ్ ఆర్మీ అధికారులు, మాజీ సైనికులను వేదికపైకి ఆహ్వానించి ఘనంగా సత్కరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశం కోసం పనిచేసిన వీరులను తమ మధ్య గౌరవించడం పట్ల కాలనీవాసులు, యువత హర్షం వ్యక్తం చేశారు.
యువతలో దేశభక్తి స్ఫూర్తి నింపేలా కార్యక్రమం
ఠాగూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల ద్వారా యువతలో దేశభక్తి, జాతీయ భావం, సామాజిక బాధ్యతలను పెంపొందించే సందేశాన్ని నిర్వాహకులు అందించారు. సైనికుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.ప్రముఖుల సందడిఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పట్టణ నాయకులు, కౌన్సిలర్లు, శ్రీనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఠాగూర్ యూత్ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు.
సైనికుల త్యాగాలకు సెల్యూట్ చేస్తూ.. జాతీయ జెండాను గర్వంగా ఎగురవేస్తూ.. దేశభక్తి నినాదాలతో శ్రీనగర్ చౌరస్తాలో సాగిన స్వాతంత్ర్య వేడుకలు 18వ వార్డులో ప్రత్యేక ముద్ర వేశాయి.



