రుద్ర కన్స్ట్రక్షన్స్‌పై సమగ్ర విచారణ జరపాలి

➜ కొనుగోలుదారులు నష్టపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి: ఆకుల సతీష్
➜ ప్రభుత్వ, మున్సిపల్, చెరువు భూముల వినియోగంపై ఫిర్యాదు
➜ డొమ్మర పోచంపల్లి, బౌరంపేట ప్రాజెక్టులపై సమగ్ర దర్యాప్తు
➜ భూముల హద్దులు, వర్గీకరణపై భౌతిక సర్వే చేపట్టాలి
➜ డ్రైనేజీ మళ్లింపుపై నీటిపారుదల శాఖతో సాంకేతిక విచారణ
➜ అనుమతులు, మంజూరైన ప్రణాళికలపై అధికారుల పరిశీలన అవసరం
➜ ఉల్లంఘనలు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి
దుండిగల్, ఆగస్టు 12 ( నమస్తే భరత్ ): దుండిగల్ మండలంలోని డొమ్మర పోచంపల్లి, బౌరంపేట ప్రాంతాల్లో రుద్ర కన్స్ట్రక్షన్స్, రుద్ర అశోక, జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్స్‌కు సంబంధించిన ప్రాజెక్టులపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆకుల సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు, మున్సిపల్‌కు సంబంధించిన ప్రజా సౌకర్యాల కోసం కేటాయించిన భూములు, చెరువు శికం భూముల వినియోగం, నిర్మాణ అనుమతులు, డ్రైనేజీ మళ్లింపు తదితర అంశాలపై పూర్తి ఆధారాలతో దుండిగల్ తహసీల్దార్, డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. దొమ్మర పోచంపల్లిలోని రుద్ర రాయల్ విలేజ్-రెండు ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే నంబర్లు 294/పీ, 295/పీ, 296/పీ, 620/పీ పరిధిలో ప్రాజెక్టు, అప్రోచ్ రోడ్డు, ప్రవేశ ద్వారం, ఆర్చ్ నిర్మాణాలు మున్సిపాలిటీకి బహూకరించేందుకు సిద్ధం చేసిన ప్రజా సౌకర్యాల కోసం కేటాయించిన భూములపై ఉన్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు భౌతిక సర్వే ద్వారా నిర్ధారించాలని సతీష్ కోరారు. సర్వే నంబర్లు 615 నుంచి 621 వరకు ఉన్న ఎమినిటీస్ భూములకు సంబంధించి బహూకరణ పత్రం ఆధారంగా సమగ్ర విచారణ జరపాలని, మున్సిపల్ భూముల ఆక్రమణ జరిగిందా, వాటిని అప్రోచ్ రోడ్డుగా చూపించి అనుమతులు పొందారా, అనధికారికంగా ఆర్చ్ నిర్మించారా అనే అంశాలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సర్వే నంబర్ 291లోని ప్రభుత్వ భూమి, చెరువు శికం భూముల వర్గీకరణ, వినియోగంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
డ్రైనేజీ మళ్లింపుపై విచారణ
గంగాదేవుని చెరువులోకి డ్రైనేజీ, మురుగు నీటిని మళ్లిస్తున్నారనే ఆరోపణలపై నీటిపారుదల శాఖ అధికారులతో సాంకేతిక విచారణ చేపట్టాలని ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. చెరువు పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బౌరంపేట ప్రాజెక్టుపైనా పరిశీలన
బౌరంపేటలోని సర్వే నంబర్లు 146, 147లో రుద్ర, జేఎన్ఎస్, అశోక కన్స్ట్రక్షన్స్ పేర్లతో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి సర్వే నంబర్ 166/1లో ప్రభుత్వ భూమి వినియోగం లేదా ఆక్రమణ జరిగిందా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని సతీష్ కోరారు. రహదారులు, ప్రహరీ గోడలు, షెడ్లు, విల్లా నిర్మాణాలు, నిర్మాణ అనుమతులపై సమగ్ర విచారణ అవసరమన్నారు. అనుమతులు లేకుండానే రెండంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై రెవెన్యూ, మున్సిపల్, సంబంధిత పట్టణాభివృద్ధి శాఖల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గతంలోనూ ప్రాజెక్టు రహదారి, అనుమతులకు సంబంధించిన వివాదాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం చర్యలు లేకపోవడంపై సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు.
సంయుక్త సర్వేకు డిమాండ్
ఈ రెండు ప్రాజెక్టులపై రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల, పట్టణాభివృద్ధి, రియల్ ఎస్టేట్ నియంత్రణ శాఖల అధికారులతో సంయుక్త సర్వే నిర్వహించాలని సతీష్ కోరారు. భూముల యాజమాన్యం, వర్గీకరణ, హద్దులు, ఆక్రమణలు, నిర్మాణ అనుమతులు, మంజూరైన ప్రణాళికలు, చెరువు ఎఫ్‌టీఎల్, శికం పరిధి తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. “ఆరోపణలు వాస్తవమా, కాదా అనేది సమగ్ర విచారణలో తేలాలి. అయితే విచారణ పూర్తయ్యే వరకు వివాదాస్పదంగా ఉన్న భూముల్లో మరింత నిర్మాణం జరగకుండా అధికారులు తక్షణ నివారణ చర్యలు చేపట్టాలి. భవిష్యత్తులో విల్లాలు కొనుగోలు చేసే ప్రజలు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి” అని ఆకుల సతీష్ అన్నారు. ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వ, మున్సిపల్, చెరువు భూములను పరిరక్షించాలని, విచారణ నివేదికను ఫిర్యాదుదారులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, ఈశ్వర్ రెడ్డి, ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.



