ప్రజల ఇబ్బందులపై ఎస్పీ వెంటనే స్పందన
దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు
కొత్తపల్లి బ్రిడ్జి వద్ద రాకపోకలకు ఊరట
ఏళ్లుగా ఇబ్బందులు.. మెదక్ ఎస్పీ చొరవతో పరిష్కారం
మెదక్ జిల్లా పాపన్నపేట, మండలం ఆగస్టు 12 (నమస్తే భారత్)
పాపన్నపేటకు వెళ్లే మార్గంలోని కొత్తపల్లి బ్రిడ్జి వద్ద బ్రిడ్జి నిర్మాణం జరిగినప్పటి నుంచి రహదారి దెబ్బతినడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారడంతో వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
ఈ సమస్యను గమనించిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ వెంటనే స్పందించారు. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా రహదారిని బాగు చేయించాలని పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్‌గౌడ్‌ను ఆదేశించారు.
ఎస్పీ ఆదేశాల మేరకు బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అనుకూలంగా రోడ్డును ఏర్పాటు చేశారు. దీంతో చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంత ఊరట లభించింది. సమస్యను గుర్తించి వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేయించిన జిల్లా ఎస్పీకి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.



