ePaper
Saturday, June 27, 2026
ePaper
Homeఎడిటోరియల్నివాస ప్రాంతంలో డంపింగ్ యార్డు తొలగించాలి

నివాస ప్రాంతంలో డంపింగ్ యార్డు తొలగించాలి

📰 Generate e-Paper Clip

నివాస ప్రాంతంలో డంపింగ్ యార్డు తొలగించాలి

-నిజాంపేట్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

-మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన

-దుర్వాసన, దోమలతో స్థానికులు అనారోగ్య భయాందోళనలో జీవనం

-రోడ్లపై చెత్తతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం

-చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సీపీఎం హెచ్చరిక

నిజాంపేట్, జూన్ 26 ( నమస్తే భరత్ ): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బండారి లేఔట్ డివిజన్‌లో, నిజాంపేట్–బాచుపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీల మధ్య ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కమిటీ సభ్యుడు రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ, జనావాసాల మధ్య చెత్తను డంపింగ్ చేయడం వల్ల తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు, ఈగలు అధికంగా పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు పక్కనే ఇటీవల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభమైందని, కళాశాలకు అడ్మిషన్ల కోసం వచ్చే విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు చెత్త కుప్పలు, దుర్వాసనను చూసి వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు. విద్యా సంస్థకు ఆనుకుని చెత్త నిల్వ చేయడం వల్ల విద్యార్థినుల ఆరోగ్యం, విద్యా వాతావరణంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. అలాగే బాచుపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీల నుంచి మహిళా డిగ్రీ కళాశాల మీదుగా నిజాంపేట్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీల వరకు రహదారులపై చెత్త పేరుకుపోవడంతో ప్రజల రాకపోకలు ఇబ్బందికరంగా మారాయని తెలిపారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. డంపింగ్ యార్డును తక్షణమే అనువైన ప్రాంతానికి తరలించి, ప్రస్తుతం ఉన్న ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రపరిచి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ, అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. డంపింగ్ యార్డును తరలించడంలో జాప్యం కొనసాగితే స్థానిక ప్రజలను సమీకరించి సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని రాథోడ్ సంతోష్ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు పి. స్వామి, తిరుపతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!