ePaper
Sunday, July 26, 2026
ePaper
Homeఎడిటోరియల్బౌరంపేట్‌లో ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం

బౌరంపేట్‌లో ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం

📰 Generate e-Paper Clip

బౌరంపేట్‌లో ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం

-తాగునీటి వృథా, డ్రైనేజీ సమస్యలపై చర్యలు కరవు

-అతివేగ వాహనాలతో ప్రమాదాలు.. స్పీడ్ బ్రేకర్లకు ప్రజల డిమాండ్

-పెరుగుతున్న చోరీల నేపథ్యంలో పోలీస్ గస్తీ పెంచాలని విజ్ఞప్తి

-ప్రజా ఆగ్రహానికి ముందే అధికారులు స్పందించాలని బీజేపీ నేతల హెచ్చరిక

బౌరంపేట్, జూన్ 20 ( నమస్తే భరత్ ): దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్ ప్రాంతంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారంలో వివిధ శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భారతీయ జనతా పార్టీ బౌరంపేట్ డివిజన్ అధ్యక్షుడు పీసరి కృష్ణారెడ్డి విమర్శించారు. మున్సిపల్, వాటర్ బోర్డు, విద్యుత్, పోలీస్ శాఖల మధ్య సమన్వయం లోపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ లీకేజీలు, మంచినీటి పైపుల పగుళ్ల కారణంగా వేల లీటర్ల తాగునీరు వృథాగా పోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతూ శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. గత కొన్ని నెలలుగా బీజేపీ నాయకులు ఈ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని పేర్కొన్నారు. బౌరంపేట్ మూడు తోవ్వల జంక్షన్‌లోని టీ టైమ్ సమీపంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం విద్యుత్ శాఖ అధికారులు గుంత తవ్వారని తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న పచ్చని చెట్లను తొలగించకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని సంబంధిత ఏఈని కోరినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం అదే ప్రాంతంలో వాటర్ లైన్ దెబ్బతిని రోజూ భారీగా తాగునీరు వృథా అవుతోందని, రోడ్డు మీదకు నీరు రాకపోవడంతో అధికారులు గుర్తించకపోవడం విచారకరమన్నారు. నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి వృథాను నివారించాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉందన్నారు. ఇక గ్రామంలో ఇటీవల చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ రాత్రి గస్తీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచాలని సూచించారు. బౌరంపేట్‌లో రహదారులు మెరుగుపడిన తర్వాత వాహనాలు అతివేగంగా దూసుకెళ్తుండటంతో ప్రమాదాలు పెరిగాయని కృష్ణారెడ్డి తెలిపారు. గత రెండేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారని పేర్కొన్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లడం, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం కూడా భయాందోళనలకు గురిచేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం సమీపం, ప్రభుత్వ పాఠశాల వద్ద, చెరువు రహదారి, ఇందిరమ్మ కాలనీ జంక్షన్, మల్లన్నగుడి మార్కెట్ ప్రాంతంతో పాటు అవసరమైన ఇతర ప్రదేశాల్లో తక్షణమే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ఇకనైనా చొరవ చూపి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు కోరారు. ప్రజా ఆగ్రహానికి గురికాకముందే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బౌరంపేట్ ప్రజలకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!