నిత్యవసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు

నమస్తే భారత్ :-తొర్రూరు
నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా చైర్మన్ వింజమూరి సుధాకర్, పౌరసరఫరాల శాఖ డీటీ కామేశ్వరరావులు తెలిపారు.
పౌరసరఫరాల శాఖ, వినియోగదారుల సమాచార కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని కిరాణా దుకాణాలు, నిత్యవసర సరుకులు విక్రయించే ఆల్ ఇన్ వన్ దుకాణాలను తనిఖీ చేశారు. పలు దుకాణాల్లో సన్న బియ్యం అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. బస్తాపై 26 కిలోలు ముద్రించి ఉండగా తూకం వేయగా 24 కిలోలే కనిపించింది. స్వదేశీ మార్కెట్లో 25 కిలోల రైస్ బ్యాగ్ ను స్థానికులకు రూ.3 వేలకు విక్రయించారు. స్థానికుల నుంచి ఫిర్యాదును నమోదు చేసుకున్నారు. దాంతోపాటు పలు దుకాణాల్లో పప్పులు, వంట సామాగ్రి, నూనె అధిక ధరలకు అమ్ముతున్నట్లు గా గుర్తించారు. ఈ సందర్భంగా వింజమూరి సుధాకర్, కామేశ్వరరావు లు మాట్లాడుతూ.ఎల్ నినో సాకుతో పాత సరుకులను కొత్త ధరలకు విక్రయించడం, ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరపడం నేరమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి సరకులను విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక చేశారు. మిల్లర్లు, హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు నిత్యావసర సరకులను నిర్ణయించిన ధరలకే విక్రయించాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు పౌర సరఫరాల శాఖ, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ, లేబర్, ఫైర్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల రక్షణ మండలి జిల్లా అధ్యక్షుడు మైస శ్రీనివాస్, డిసిఐసి సభ్యుడు జాన్, తదితరులు పాల్గొన్నారు.



