బాలికల భవిష్యత్ కు భరోసా కల్పించాలి
నమస్తే భారత్ :-తొర్రూరు
బాల్య వివాహాలను ఎవరూ ప్రోత్సహించవద్దని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని సోమవరపు కుంట తండా సర్పంచ్ బానోత్ సాగర్ నాయక్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎస్.కె. గౌసియాలు అన్నారు. శుక్రవారం మండలంలోని సోమవరపు కుంట తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ బాలల పరిరక్షణ కమిటీ (వీసీపీసీ) సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తుకు ఆటంకంగా మారుతాయని, వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కిశోర బాలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని, బాలికలకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు.బాలల వ్యక్తిగత పరిశుభ్రత,ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిర్మూలనకు తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత కల్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వాణి, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, పాఠశాల హెచ్ఎం రంజిత్, ఉపాధ్యాయుడు ప్రసాద్,అంగన్‌వాడీ టీచర్లు చంద్రకళ, సీత,వివో అధ్యక్షురాలు యాకమ్మ, పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శాంతమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



