జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ అమలుకు టీయూడబ్ల్యూజే వినతి
మేడ్చల్ డీఈఓ రేణుకాదేవిని కలిసిన ప్రతినిధి బృందం – 2026–27 విద్యా సంవత్సరానికి 50 శాతం రాయితీపై ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి
కుత్బుల్లాపూర్, జూన్ 9 ( నమస్తే భరత్ ); జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయు) మేడ్చల్ జిల్లా శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ప్రతినిధి బృందం మంగళవారం జిల్లా విద్యాధికారి (డీఈఓ) రేణుకాదేవిని కలిసి వినతిపత్రం అందజేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లా పరిధిలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఈ రాయితీ వర్తించేలా స్పష్టమైన మార్గదర్శకాలు, ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు. జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా విద్యా భారం తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని టీయూడబ్ల్యూజే ప్రతినిధులు సూచించారు.
ఈ వినతిపై డీఈఓ రేణుకాదేవి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సంబంధిత అధికారులతో సమీక్షించి త్వరలోనే అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె సూచించినట్లు తెలిసింది. అలాగే, వ్యక్తిగతంగా ఫీజు రాయితీ లెటర్లు అవసరమైన జర్నలిస్టులు జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజ్, జిల్లా కార్యదర్శి దొంతుల వెంకట్రాంరెడ్డి, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవిచంద్ర, నాయకులు రామారావు, ప్రసాద్, భూపాల్, నరోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

