ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeఎడిటోరియల్జనావాసాల మధ్య అక్రమ బోరు తవ్వకంపై ఉద్రిక్తత

జనావాసాల మధ్య అక్రమ బోరు తవ్వకంపై ఉద్రిక్తత

📰 Generate e-Paper Clip

జనావాసాల మధ్య అక్రమ బోరు తవ్వకంపై ఉద్రిక్తత
ప్రభుత్వ బోరుకు 10 మీటర్ల దూరంలో కొత్త బోరు తవ్వకానికి స్థానికుల అడ్డుకట్ట
అధికారుల జోక్యంతో పనులు నిలిపివేత.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
కాలనీవాసుల ఆందోళనతో సంఘటన స్థలానికి చేరుకున్న ప్రజాప్రతినిధులు
వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ అధికారుల స్పష్టం
కుత్బుల్లాపూర్, జూన్ 10 ( నమస్తే భరత్ ):జనావాసాల నడుమ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బోరు తవ్వకాలు చేపట్టేందుకు చేసిన ప్రయత్నం స్థానికుల నిరసనతో నిలిచిపోయింది. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోరుకు అత్యంత సమీపంలో మరో బోరు తవ్వేందుకు యజమాని ప్రయత్నించడంతో సంజీవయ్య నగర్ కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు స్థానికుల ఆందోళన, ప్రజాప్రతినిధుల జోక్యం, రెవెన్యూ అధికారుల హెచ్చరికలతో బోరు తవ్వకాలను నిలిపివేశారు. కాలనీలో ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సుమారు 12 సంవత్సరాల క్రితం 6 అంగుళాల బోరును ఏర్పాటు చేసింది. అయితే అదే బోరుకు కేవలం 10 మీటర్ల దూరంలో మరో 6 అంగుళాల బోరు తవ్వేందుకు యజమాని చర్యలు ప్రారంభించడంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కాలనీ అధ్యక్షుడు యాదగిరి సంఘటన స్థలానికి చేరుకుని పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ బోరుకు సమీపంలో మరో బోరు తవ్వడం వల్ల భూగర్భ జలమట్టాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, కాలనీలోని ప్రజల తాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తవ్వకాలను అధికారులు వెంటనే అడ్డుకోవాలని కోరారు. స్థానికుల అభ్యంతరాలను పట్టించుకోకుండా బోరు తవ్వకాలను కొనసాగించేందుకు యజమాని ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో రవి కుమార్ యాదవ్, యువ నాయకుడు గంగాధర్, కాశి విశ్వనాధ్, విజయ్ కుమార్ యాదవ్, స్థానిక కాలనీ మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి బోరు తవ్వకాలను అడ్డుకున్నారు. అంతేకాకుండా సంఘటన స్థలం వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రజల అభ్యంతరాలు, నీటి సమస్యలపై ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని అక్రమ బోరు తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని యజమానికి సూచించారు. దీంతో అక్కడ నెలకొన్న ఉద్రిక్తత కొంతవరకు తగ్గింది. అనంతరం సమాచారం అందుకున్న ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు, వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ బోరు తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు బోరు తవ్వకాలకు ఉపయోగిస్తున్న వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల హెచ్చరికలతో బోరు తవ్వకాలకు వచ్చిన యంత్రాలు, వాహనాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. దీంతో కొంతసేపు ఉద్రిక్తంగా మారిన వాతావరణం సద్దుమణిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, భూగర్భ జలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, వాల్టా చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు యాదగిరి, రవి కుమార్ యాదవ్, యువ నాయకుడు గంగాధర్, కాశి విశ్వనాధ్, విజయ్ కుమార్ యాదవ్, కాలనీ మహిళలు, పలువురు స్థానికులు పాల్గొన్నారు.

“భూగర్భ జలాల రక్షణ అందరి బాధ్యత”

జనావాసాల మధ్య విచక్షణారహితంగా బోర్లు తవ్వడం వల్ల భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు అక్రమ బోరు తవ్వకాలను అరికట్టాలని, భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడేందుకు అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!