ePaper
Tuesday, June 16, 2026
ePaper
Homeఎడిటోరియల్కబ్జాపై కొరడా..!

కబ్జాపై కొరడా..!

📰 Generate e-Paper Clip

కబ్జాపై కొరడా..!

కేసులు, నోటీసులను బేఖాతరు చేసిన ఆక్రమణదారులు

గాజులరామారం సర్వే నెం.79లో భారీ కూల్చివేతలు

ప్రోక్లైనర్ అడ్డుకునే యత్నం.. పోలీసుల జోక్యం

ప్రహరీ గోడ, పునాదుల తొలగింపుతో ప్రభుత్వ భూమి స్వాధీనం

బండరాయితో అధికారులను బెదిరించిన ఫిరోజ్ ఖాన్

హైడ్రామా మధ్య స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలింపు

ప్రభుత్వ భూముల ఆక్రమణను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న రెవెన్యూ అధికారులు

కుత్బుల్లాపూర్, జూన్ 15 ( నమస్తే భరత్ ): ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై రెవెన్యూ యంత్రాంగం కొరడా ఝళిపించింది. గాజులరామారం పరిధిలోని సర్వే నంబర్–79లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వ్యవహారంలో సోమవారం భారీ కూల్చివేతలు నిర్వహించారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య జరిగిన ఈ చర్యలు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.
రెవెన్యూ శాఖ అధికారుల వివరాల ప్రకారం, ప్రభుత్వ భూమిగా నమోదైన స్థలంలో ఫిరోజ్ ఖాన్ అక్రమంగా ప్రహరీ గోడతో పాటు నిర్మాణాలకు సంబంధించిన పునాదులు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 13న కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
అయినప్పటికీ ఆక్రమణదారులు కేసులు, నోటీసులను బేఖాతరు చేస్తూ నిర్మాణ కార్యకలాపాలు కొనసాగించడంతో అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. సోమవారం ఉదయం కూల్చివేతల కోసం ప్రోక్లైనర్ యంత్రం సంఘటనా స్థలానికి చేరుకోగానే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అధికారులు ఎంతగా వారించినా వినకుండా ఫిరోజ్ ఖాన్ బండరాయిని చేతబట్టి ప్రోక్లైనర్ డ్రైవర్‌తో పాటు రెవెన్యూ అధికారులను బెదిరించేందుకు ప్రయత్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ప్రోక్లైనర్ యంత్రంపై రాళ్లు విసిరి గందరగోళ పరిస్థితులు సృష్టించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పరిస్థితి అదుపు తప్పే అవకాశముండటంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అక్కడున్న వారిని నియంత్రించారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొందరిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం పోలీసుల రక్షణ నడుమ రెవెన్యూ అధికారులు తమ చర్యలను కొనసాగించారు.
ఈ హైడ్రామా మధ్య ఫిరోజ్ ఖాన్ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ అధికారులు వెనక్కి తగ్గకుండా కూల్చివేతలను పూర్తి చేశారు.
పోలీసుల పహారా నడుమ ప్రహరీ గోడతో పాటు నిర్మాణ పునాదులను పూర్తిగా తొలగించారు. కూల్చివేత ప్రక్రియ ముగిసే వరకు జీడిమెట్ల ఎస్‌ఐలు ప్రేమ్ సాగర్, శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు కొనసాగింది.

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ లేదు : ఆర్‌ఐ ఖలీం

ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఖలీం స్పష్టం చేశారు. “అధికారిక రికార్డుల ప్రకారం ఈ స్థలం ప్రభుత్వానికి చెందినది. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం మా బాధ్యత. ఎంతటి వారైనా ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు” అని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!