ePaper
Tuesday, June 16, 2026
ePaper
Homeఎడిటోరియల్అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్.

అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్.

📰 Generate e-Paper Clip

అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్.

నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)

భద్రాద్రి జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. రెండవ ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, గృహనిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెండో విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న పూరి గుడిసెలు, నివాసయోగ్యం కాని ఇళ్లు, వివరాలను సేకరిస్తూ నిర్వహిస్తున్న సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న పరిశీలనల్లో పారదర్శకత, నిష్పాక్షికత పాటించి అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా చూడాలని సూచించారు.
సమావేశంలో మండలాల వారీగా నియమించిన పరిశీలన అధికారుల సంఖ్య, వారి పనితీరు, క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్న విధానంపై సమగ్రంగా చర్చించారు. ఇంటింటికీ వెళ్లి అర్హుల వివరాలను నమోదు చేయడం, భౌతిక పరిశీలన నిర్వహించడం, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక చేపట్టడం వంటి అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా మండలాల వారీగా ఆధార్ నవీకరణ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలపై కూడా సమీక్ష నిర్వహించారు. ఆధార్ నవీకరణ ప్రక్రియను వేగవంతం చేసి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు గృహ వసతి కల్పించడమే లక్ష్యమని, అధికారులు సమన్వయంతో పనిచేసి పథకం అమలును విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. ఈ సమావేశం లో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, గృహ నిర్మాణ శాఖాధికారి సవేరామ్, ఎంపీడీవోలు, గృహ నిర్మాణశాఖ ఏ ఈ లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!