నాగాలాండ్ శిఖరంపై త్రివర్ణ పతాకం
మౌంట్ సరమతి అధిరోహణతో ‘సెవెన్ సిస్టర్స్ ఎక్స్‌పెడిషన్’ పూర్తి
‘హర్ శిఖర్ పర్ తిరంగా’ లక్ష్యంతో ముందుకు సాగుతున్న భూక్య యశ్వంత్
నమస్తే భారత్ :-మరిపెడ
తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా భూక్య తండాకు చెందిన భారత పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ మరో ఘనత సాధించారు. నాగాలాండ్‌లోని అత్యంత ఎత్తైన శిఖరం *మౌంట్ సరమతి (3,841 మీటర్లు)*ను సెప్టెంబర్ 20 ఉదయం విజయవంతంగా అధిరోహించి, అక్కడ జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో ఆయన చేపట్టిన ‘హర్ శిఖర్ పర్ తిరంగా–సెవెన్ సిస్టర్స్ ఎక్స్‌పెడిషన్’ విజయవంతంగా పూర్తయింది.షిల్లాంగ్ నుంచి ప్రారంభమైన యాత్ర నాగాలాండ్‌లోని కిఫిరే జిల్లా మీదుగా థనమిర్ ప్రాంతానికి చేరుకుంది. అక్కడి నుంచి సరమతి బేస్ క్యాంప్‌కు చేరుకుని సుమారు మూడు రోజుల పాటు క్లిష్టమైన పర్వతారోహణ కొనసాగించారు. పొడవైన ట్రెక్కింగ్ మార్గాలు, నిటారుగా ఉన్న జారుడు బాటలు, అటవీ ప్రాంతాలు, కఠినమైన శిఖర మార్గాలను అధిగమిస్తూ యశ్వంత్ బృందం ముందుకు సాగింది.చివరి దశలో ప్రతికూలమైన, జారుడు మార్గాలు ఎదురైనా పట్టుదల, శారీరక సామర్థ్యం, బృంద సమన్వయంతో యశ్వంత్ శిఖరాన్ని చేరుకున్నారు. శిఖరాగ్రానికి చేరుకున్న అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి నాగాలాండ్ అధ్యాయాన్ని విజయవంతంగా ముగించారు.
యువతకు స్ఫూర్తినివ్వడమే లక్ష్యం
భూక్య తండా నుంచి ప్రారంభమైన తన పర్వతారోహణ ప్రయాణం పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసంతో సాగుతోందని యశ్వంత్ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల యువత క్రీడలు, సాహస యాత్రల ద్వారా తమ ప్రతిభను చాటుకోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.“నా ప్రయాణం కేవలం శిఖరాలను అధిరోహించడం మాత్రమే కాదు. పట్టుదల, ధైర్యం, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే మన పరిమితులను అధిగమించవచ్చని యువతకు చూపించడమే నా లక్ష్యం. ప్రతి పర్వతం నాకు కొత్త పాఠాన్ని నేర్పింది. కృషి చేస్తే ఏ లక్ష్యమైనా సాధించవచ్చనే నమ్మకాన్ని ప్రతి యాత్ర మరింత బలపరిచింది. అని యశ్వంత్ పేర్కొన్నారు.
28 రాష్ట్రాల అత్యున్నత శిఖరాలే లక్ష్యం
‘హర్ శిఖర్ పర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 28 రాష్ట్రాల అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ప్రతి శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో పాటు ఆయా ప్రాంతాల పర్వతాలు, ప్రకృతి, సంస్కృతి, ప్రజల జీవన విధానాలను డాక్యుమెంట్ చేయడం యశ్వంత్ లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, మేఘాలయ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గోవా తదితర రాష్ట్రాల అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. గురు శిఖర్, అర్మకొండ, దేవమాలి, సొన్సోగోర్ వంటి రాష్ట్ర శిఖరాలతో పాటు మౌంట్ గోరిచెన్, మౌంట్ రియో పుర్గ్యిల్, కాంగ్ యాట్సే-2, రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్, టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో వంటి ప్రముఖ శిఖరాలను కూడా అధిరోహించారు.నాగాలాండ్‌లోని మౌంట్ సరమతి విజయంతో ‘సెవెన్ సిస్టర్స్ ఎక్స్‌పెడిషన్’ను పూర్తి చేసిన యశ్వంత్, తన తదుపరి పర్వతారోహణ లక్ష్యాల వైపు ముందుకు సాగుతున్నారు. ఈ ప్రయాణం సాహసం, క్రీడా స్ఫూర్తితో పాటు దేశభక్తి, యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.తన పర్వతారోహణ ప్రయాణానికి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం, సహకారం అందిస్తున్న అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా, ఏవీఎస్ఎం, ఎస్ఎంకు యశ్వంత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



