పిల్లల భవిష్యత్తే గ్రామ భవిష్యత్తు
సర్పంచ్ దాసరి రమేష్
ఖానాపురం, నవంబర్ 14 (మల్లేష్ నమస్తే భారత్):
నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లల భవిష్యత్తే గ్రామ భవిష్యత్తు అని ఖానాపురం గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ అన్నారు.
నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బాలల గ్రామసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు, భవిష్యత్తులో వారి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.పిల్లల సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల నివారణ, పోషకాహార లోపం నివారణ, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆటస్థలాల ఏర్పాటు, మొబైల్ ఫోన్ల వినియోగం, మత్తుపదార్థాల నివారణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమస్యల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బాలలు తమ సమస్యలను ఎలాంటి భయం, సంకోచం లేకుండా గ్రామసభలో స్వేచ్ఛగా వెల్లడించేలా వారిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి బాలబాలికకు నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, రక్షణ, సమాన అవకాశాలు కల్పించడమే బాలల గ్రామసభ ప్రధాన ఉద్దేశమని దాసరి రమేష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుమారస్వామి, రాజు, వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్, వేములపల్లి వెంకటప్రసాదరావు, ఈలపొంగు కొమురమ్మ, గుండ్లపల్లి మంజుల, ఏఎన్ఎం లు ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, సీఏలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



