ePaper
Monday, August 3, 2026
ePaper
Homeఎడిటోరియల్బీరప్ప స్వామి దేవాలయం కూల్చివేత దారుణం

బీరప్ప స్వామి దేవాలయం కూల్చివేత దారుణం

📰 Generate e-Paper Clip

*బీరప్ప స్వామి దేవాలయం కూల్చివేత దారుణం*

*షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆగ్రహం*

*బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆందోళన తప్పదని హెచ్చరిక*

*వందల ఏళ్ల చరిత్ర ఉన్న బీరప్ప దేవాలయం కూల్చివేతపై ఆవేదన*

*దేవాలయ పిల్లర్లు, స్టీల్ తొలగించడం భక్తుల మనోభావాలకు దెబ్బ*

*సీఎస్కే విల్లాస్ వెంచర్‌లో భూములపై అక్రమాల ఆరోపణలు*

*భూమి అమ్మకపోయినా రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని ప్రశ్న*

*లేఅవుట్లకు అనుమతుల ముందు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి*

*ధనవంతుల మాటలు విని ప్రజలకు అన్యాయం చేయొద్దని అధికారులకు సూచన*

*దేవాలయాలపై దాడులు సహించబోమన్న మాజీ ఎమ్మెల్యే*

*ప్రజల్లో నమ్మకం కలిగేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్*

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 03 :షాద్‌నగర్ పట్టణంలోని సీఎస్కే విల్లాస్ వెంచర్‌లో బీరప్ప స్వామి దేవాలయం నిర్మాణాలను కూల్చివేయడం పట్ల షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత వై. అంజయ్య యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన సంఘటన స్థలాన్ని సందర్శించి కూల్చివేసిన దేవాలయ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు ఆయన వెంట పాల్గొన్నారు.
దేవాలయం కూల్చివేత జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన అంజయ్య యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారం చేయడం తప్పు కాదని, కానీ ప్రజలను, రైతులను భయభ్రాంతులకు గురిచేసి మోసపూరితంగా భూములను స్వాధీనం చేసుకుని లేఅవుట్లు వేయడం దారుణమని అన్నారు. ఫరూక్‌నగర్ ప్రాంతంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన బీరప్ప గడ్డ, కురుమ కులస్థుల ఇష్టదైవమైన బీరప్ప స్వామి దేవాలయాన్ని కూల్చివేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పట్టపగలు దేవాలయాలను కూల్చివేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. తమ తాతలు, తండ్రుల కాలంలో నిర్మించిన దేవాలయాన్ని నేడు కూల్చివేయడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయానికి సంబంధించిన పిల్లర్లు, స్టీల్ సామగ్రిని కూడా దౌర్జన్యంగా తొలగించడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే చర్య అని అన్నారు.

*వెంచర్ భూములపైనా అక్రమాల ఆరోపణలు*

సీఎస్కే విల్లాస్ వెంచర్‌లో పలువురు రైతుల భూములను కూడా అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు తన దృష్టికి వస్తోందని అంజయ్య యాదవ్ ఆరోపించారు. పక్కనే ఉన్న రైతు తన భూమిని అమ్మకపోయినా, రిజిస్ట్రేషన్ చేయించకపోయినా ఆ భూమిని కూడా లేఅవుట్ చేసినట్టు ఉందని, ఇలాంటి అక్రమాలు ఎన్ని జరిగాయో అధికారులు విచారణ చేసి బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

*అధికారుల నిర్లక్ష్యమే కారణం*

వెంచర్లకు లేఅవుట్ అనుమతులు మంజూరు చేసే ముందు అధికారులు క్షేత్రస్థాయిలో ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా ధనవంతులు చెప్పిన మాటలు నమ్మి ప్రజలకు అన్యాయం చేయడం సరికాదన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు.

*పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి*

బీరప్ప దేవాలయం కూల్చివేత ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయడమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య డిమాండ్ చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో అసహనం, ఆగ్రహం పెరిగి ఆందోళనలు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు తలెత్తక ముందే ప్రభుత్వం, పోలీసులు స్పందించాలని కోరారు.
దేవాలయాలపై దాడులు జరిగితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించిన ఆయన, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీ అధికారులు కూడా సంఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు.

*న్యాయపోరాటంతో పాటు ప్రజా ఉద్యమం కూడా*

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో న్యాయపరంగా పోరాటం చేయడంతో పాటు అవసరమైతే ప్రజా ఉద్యమాన్ని కూడా చేపడతామని స్పష్టం చేశారు. కొంతమంది రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసి అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో లేఅవుట్లు వేస్తున్నారని, ఇలాంటి అక్రమ పద్ధతుల్లో కొందరు సిద్ధహస్తులుగా మారారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. చివరగా, దేవాలయాలపైనే ఇలాంటి దాడులు జరిగితే ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతారని, పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. లేదంటే సమాజంలో ఘర్షణలకు దారితీసే పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, ప్రభుత్వం, పోలీసులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అందే బాబాయ్య, కౌన్సిలర్లు పిల్లి శారద శేఖర్, జయలక్ష్మి కిషోర్ ఎస్పీ శివ, మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, మాజీ పీఎసీఎస్ చైర్మన్ విఠల్, మాజీ కౌన్సిలర్ జూపల్లి శంకర్, చిన్న యాదగిరి, నాయకులు నక్కల వెంకటేష్ గౌడ్, రవి యాదవ్, నందిగామ శ్రీనివాస్, బిక్షపతి, చెర్క శివ, పాండు, సాయి తదితరులు, కుర్వ సంఘం నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!