*పేదల ఆహార భద్రతపై దెబ్బ కొట్టే సవరణలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి.*
*జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని బలహీనపరిచే కుట్రలను అడ్డుకుంటాం*
*ఎన్పి ఆర్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి హెచ్చరిక*
నమస్తే భారత్ షాద్ నగర్ జులై08:జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ ఎఫ్ ఎస్ ఏ)కు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పి ఆర్ డి ) జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి డిమాండ్ చేశారు. పేదలు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, గిరిజనులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు, రోజువారీ కూలీలు వంటి అత్యంత బలహీన వర్గాల ఆహార భద్రతకు ఈ సవరణలు తీవ్ర ముప్పుగా మారతాయని జిల్లా అధ్యక్షుడు ఆశన్న, భుజంగారెడ్డి పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన (ఏ ఏవై)లో ప్రస్తుతం అమలులో ఉన్న కుటుంబ ప్రాతిపదిక అర్హత విధానాన్ని తొలగించి, వ్యక్తి ప్రాతిపదిక అర్హత విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఒక్కో వ్యక్తికి 7 కిలోల బియ్యం ఇస్తామని చెబుతున్నప్పటికీ, పెద్ద కుటుంబాలకు ప్రస్తుతం లభిస్తున్న 35 కిలోల పరిమితి దాటే ప్రయోజనం ఉండదని, మరోవైపు చిన్న కుటుంబాలు ఇప్పటివరకు పొందుతున్న 35 కిలోల పూర్తి హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.వృద్ధ దంపతులు, వితంతువులు, దివ్యాంగులు, గిరిజన కుటుంబాలు, భూమిలేని వ్యవసాయ కార్మికులు, రోజువారీ కూలీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, చిన్న కుటుంబాలు వంటి వర్గాలు కుటుంబ పరిమాణంతో సంబంధం లేకుండా ఏ ఏ వై పై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. ప్రతిపాదిత సవరణలు అమలైతే వారి ఆహార భద్రతకు తీవ్ర విఘాతం కలుగుతుందని అన్నారు.కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి, సగటు కుటుంబ పరిమాణాన్ని తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలే ఈ నిర్ణయంతో ఎక్కువగా నష్టపోతాయని పేర్కొన్నారు. జనాభా నియంత్రణలో విజయాలు సాధించిన రాష్ట్రాలకు ఆహార ధాన్యాల కేటాయింపులు తగ్గడం అన్యాయమని విమర్శించారు.అలాగే, 2011 జనగణన ఆధారంగా ఉన్న
ఎన్ ఎఫ్ ఎస్ ఏ లబ్ధిదారుల జాబితాను నవీకరించాలని ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నప్పటికీ, లక్షలాది అర్హులైన పేదలను చట్ట పరిధిలోకి తీసుకురాకుండా, వారి హక్కులను తగ్గించే విధంగా సవరణలు తీసుకురావడం సరైంది కాదన్నారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం లబ్ధిదారుల జాబితాను విస్తరించి, ఆహార భద్రత హక్కును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.ప్రజల దీర్ఘకాల పోరాటాల ఫలితంగా ఆహారాన్ని చట్టబద్ధ హక్కుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని క్రమంగా బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీ హైకోర్టు వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం అంత్యోదయ కార్డుల ద్వారా లక్షలాది మంది వికలాంగుల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, వాటి ప్రయోజనాలను తగ్గించడం అంటే వారి ఆహార భద్రతను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ సవరణలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు, పేద ప్రజలను సమీకరించి ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని ఎన్పి ఆర్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న, భుజంగారెడ్డి హెచ్చరించారు.



