టి జి టి డబ్ల్యూ ఆర్ యస్ గూడూరులో ఘనంగా నెయిబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం
నమస్తే భారత్ :-పాలకుర్తి
గూడూరు టి జి టి డబ్ల్యూ ఆర్ యస్ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ (మై భారత్ ) కార్యక్రమం ద్వారా 2026–27 సంవత్సరానికి సంబంధించిన నెయిబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
నషా ముక్త యువ – మాదకద్రవ్యాల రహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం, కుటుంబాలు మరియు సమాజంపై పడే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు సర్పంచ్ మాచర్ల స్వరూప పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆస్ఫియా, ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, మై భారత్ వాలంటీర్ ఎలమకంటి సందీప్, కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి సర్పంచ్ మాచర్ల స్వరూప మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు బానిస కాకుండా విద్య, క్రీడలు, సామాజిక సేవపై దృష్టి సారించాలని సూచించారు. మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
మై భారత్ వాలంటీర్ ఎలమకంటి సందీప్ మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించడం, సామాజిక సమస్యలపై చర్చించే వేదికగా నెయిబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు మరియు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలనే స్ఫూర్తిని పెంపొందించారు.



