ePaper
Monday, September 21, 2026
ePaper
Homeఎడిటోరియల్ఖరీఫ్‌ 2026–27 ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు 15 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ఖరీఫ్‌ 2026–27 ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు 15 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

📰 Generate e-Paper Clip

ఖరీఫ్‌ 2026–27 ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు
15 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు


రైతులకు ఇబ్బందులు లేకుండా సేకరణ ప్రక్రియ
48 గంటల్లో రైతుల ఖాతాల్లో చెల్లింపులు

కుత్బుల్లాపూర్, ఆగస్టు 12: ( నమస్తే భరత్ ); ఖరీఫ్‌ 2026–27 సీజన్‌లో ధాన్యం సేకరణను సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అదనపు జిల్లా కలెక్టర్‌ (పౌరసరఫరాలు) డి. విజయేందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ ఎల్. సుగుణ బాయి, వ్యవసాయ విస్తరణ అధికారి చంద్రకళ, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారి ఎం.డి. రియాజ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

గన్నీల కొరత లేకుండా చర్యలు
ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన మేరకు గన్నీలు అందుబాటులో ఉంచాలని అదనపు జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

నాణ్యమైన ధాన్యమే కేంద్రాలకు తేవాలి
రైతులు తమ వడ్లను తడి, తాలు, దుమ్ము లేకుండా శుభ్రపరిచి, బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. వరికోత సమయంలో వరి నూర్పిడి యంత్రాల యజమానులతో సమన్వయం చేసుకుని ధాన్యం క్రమపద్ధతిలో కొనుగోలు కేంద్రాలకు చేరేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

ట్యాబ్‌ ఎంట్రీ అదే రోజు పూర్తి చేయాలి
కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ట్యాబ్‌ ఎంట్రీల్లో జాప్యం కారణంగా రైతుల చెల్లింపులు ఆలస్యం కాకుండా ప్రతి ఎంట్రీని అదే రోజు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

48 గంటల్లో ఖాతాల్లో నగదు
రైతులు ధాన్యం విక్రయించిన అనంతరం 48 గంటల్లోపే వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా చెల్లింపులు జమయ్యేలా చర్యలు తీసుకుంటామని అదనపు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో నిరంతర సమీక్ష చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సమన్వయంతో పనిచేయాలి
ధాన్యం సేకరణ ప్రక్రియలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజయేందర్‌ రెడ్డి సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అధికారులకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!