ప్రజా సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి – హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తాం

డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
నమస్తే భారత్ :-మరిపెడ
పేద ప్రజలకు ఉపయోగపడేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా పథకాలను ప్రభుత్వం తొలగించడం సరికాదని, వాటిని పునరుద్ధరించే వరకు పోరాటం ఆగదని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ హెచ్చరించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఖమ్మం- వరంగల్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రెడ్యానాయక్ మాట్లాడుతూ పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం తొలగించడం తగదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రజలు తగిన సమయంలో తగిన సమాధానం చెబుతారని విమర్శించారు. సాగునీటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మిస్తీ వాటిని పక్కనపెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనివల్ల రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పథకాలను పునరుద్ధరించే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ కుమార్, నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు రవిచంద్ర, అయూబ్ ఖాన్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



