నిమోనియాపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి
ఖానాపురం నవంబర్ 12 (మల్లేష్ నమస్తే భారత్ ) :
ఖానాపురం మండలంలోని బుధరావుపేట అంగన్ వాడీ కేంద్రంలో ఖానాపురం పీహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో ప్రపంచ నిమోనియా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నవంబర్ 12న ప్రపంచ నిమోనియా దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే నిమోనియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడం, ఈ వ్యాధి కారణంగా సంభవించే చిన్నారుల మరణాలను తగ్గించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.నిమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్ అని, సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వివరించారు.నిమోనియా నివారణకు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
చిన్నారులకు తల్లిపాలు అందించడం, పోషకాహారం ఇవ్వడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం, పొగ మరియు దుమ్ము నుంచి పిల్లలను రక్షించడం అవసరమన్నారు.
పిల్లలకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, సరైన పోషకాహారం అందించడం ద్వారా నిమోనియా ముప్పును తగ్గించవచ్చని తెలిపారు. దగ్గు, జ్వరం, వేగంగా శ్వాస తీసుకోవడం, ఛాతి లోపలికి వెళ్లడం, పాలు లేదా ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ముఖ్యంగా న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పిసివీ) చిన్నారులకు ఎంతో ముఖ్యమని, న్యూమోకాకస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తప్పనిసరిగా వేయించాలని కోరారు.నిమోనియాను నివారిద్దాం.. చిన్నారుల ప్రాణాలను కాపాడుదాం.. అనే నినాదంతో ప్రతి ఒక్కరూ అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జమీరుద్దీన్, హెల్త్ అసిస్టెంట్లు గొడిశాల భాస్కర్, భార్గవి, ఆశా కార్యకర్త జ్యోతి, అంగన్వాడీ సూపర్వైజర్ రమా, అంగన్ వాడీ టీచర్లు రాణి, సునీత, ఆయా తదితరులు పాల్గొన్నారు.



