ePaper
Friday, November 13, 2026
ePaper
Homeతెలంగాణషాద్‌నగర్‌లోని డక్కలి కులస్థులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలి

షాద్‌నగర్‌లోని డక్కలి కులస్థులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

*షాద్‌నగర్‌లోని డక్కలి కులస్థులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలి*

*చంద్రకళ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి*

*చంద్రకళ కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు 3 ఎకరాల భూమి ఇవ్వాలి*

*చంద్రకళ సంస్మరణ సభలో మాట్లాడుతున్న పసుపుల ప్రశాంత్..*

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్12:శాతవాహన విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య అభ్యసిస్తున్న దాకూరి చంద్రకళ అనుమానాస్పద మృతిపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజా, హక్కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. షాద్‌నగర్ పెన్షనర్ భవన్‌లో గురువారం చైతన్య మహిళా సంఘం నిర్వహించిన చంద్రకళ సంస్మరణ సభలో ఆమెకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న పసుపుల ప్రశాంత్ మాట్లాడుతూ, చంద్రకళ మరణాన్ని కేవలం ఒక కుటుంబ విషాదంగా చూడకూడదని, ఆమె మరణం వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.పేదరికం, సామాజిక వెనుకబాటుతనం ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ వాటిని అధిగమించి చంద్రకళ ఉన్నత విద్యను అభ్యసించారని గుర్తుచేశారు. గురుకుల విద్య నుంచి డిగ్రీ, పీజీ వరకు చదివి, ఎస్సై కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమై, అనంతరం న్యాయ విద్యలో ప్రవేశం పొందడం ఆమె పట్టుదలకు నిదర్శనమన్నారు.చంద్రకళ తన కోసం మాత్రమే చదవలేదు. తనలాంటి పేద విద్యార్థులకు చదువు చెప్పింది. తన సమాజంలోని సమస్యలపై అధికారులను ప్రశ్నించింది. తన చుట్టూ ఉన్న సమాజం కోసం ఆలోచించిన ఒక విద్యార్థిగా ఎదిగింది” అని పేర్కొన్నారు.నవంబర్ 1న హాస్టల్ గదిలో చంద్రకళ మృతిచెందిన ఘటనపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెబుతున్న నేపథ్యంలో, పోలీసులు ప్రతి కోణంలోనూ విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఎవరినీ ముందుగానే దోషిగా ప్రకటించడం మా ఉద్దేశం కాదు. కానీ ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందితే ప్రశ్నలు అడగడం ప్రజల హక్కు. నిజం బయటకు రావాలి.. దోషి ఎవరో తేలాలి.. నిర్దోషికి అన్యాయం జరగకూడదు” అని అన్నారు.దక్కలి కులస్థులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలి చంద్రకళ కుటుంబం ఎదుర్కొన్న పేదరికం, సామాజిక వెనుకబాటుతనం ఒక్క కుటుంబానికే పరిమితమైన సమస్య కాదన్నారు. షాద్‌నగర్‌లో నివసిస్తున్న దక్కలి కులస్థులందరికీ ప్రభుత్వం తక్షణమే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.దక్కలి కుటుంబాలకు సొంత ఇళ్లు, భూమి, స్థిరమైన ఉపాధి లేక అనేక కుటుంబాలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి దక్కలి కుటుంబాన్ని గుర్తించి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, భూమి, విద్య, ఉపాధి వంటి ప్రాథమిక హక్కులు కల్పించాలని కోరారు.దక్కలి కుటుంబాలు ప్రభుత్వ పథకాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండకూడదు. ఇల్లు అనేది దానం కాదు.. ప్రతి కుటుంబానికి గౌరవంగా జీవించే హక్కు. షాద్‌నగర్‌లోని దక్కలి కులస్థులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేసి ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాలి” అని అన్నారు.అదేవిధంగా చంద్రకళ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దక్కలి, సంచార జాతుల పిల్లలు విద్యను మధ్యలో నిలిపివేయకుండా ప్రత్యేక విద్యా సహాయ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.చంద్రకళ మృతి నేపథ్యంలో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల భద్రతపై కూడా ప్రభుత్వం, విద్యాసంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ప్రతి కాలేజీ, యూనివర్సిటీలో కౌన్సెలింగ్ కేంద్రాలు, భరోసా కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలని, మహిళల భద్రతకు సంబంధించిన వ్యవస్థలను బలోపేతం చేయాలని అన్నారు.యూనివర్సిటీ అంటే కేవలం తరగతులు, పరీక్షలు నిర్వహించే ప్రదేశం కాదు. ఒక విద్యార్థి భయపడుతున్నప్పుడు భరోసా ఇవ్వాలి.. సమస్యలో ఉన్నప్పుడు మాట్లాడే అవకాశం కల్పించాలి.. అవసరమైనప్పుడు కౌన్సెలింగ్ అందించాలి. విద్యార్థి భద్రత కూడా విద్యాసంస్థ బాధ్యతే” అని పేర్కొన్నారు.చంద్రకళ తిరిగి రాకపోయినా ఆమె ఆశయాలు, చదువు పట్ల ఉన్న పట్టుదల, సమాజం పట్ల ఉన్న బాధ్యతను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు నిజమైన నివాళి అన్నారు.చంద్రకళ తిరిగి రాదు. కానీ మరో చంద్రకళ ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోకుండా చూడాలి. పేద విద్యార్థులు భయపడకుండా చదువుకునే వాతావరణం కల్పించాలి. మహిళలకు భద్రత, భరోసా కల్పించాలి. దక్కలి కుటుంబాలకు గౌరవంగా జీవించే హక్కు కల్పించాలి. అదే చంద్రకళకు మనం ఇచ్చే నిజమైన నివాళి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా, హక్కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, చంద్రకళ కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!