ePaper
Monday, September 14, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎలిగేన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజేత పవర్ స్ట్రైకర్స్

ఎలిగేన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజేత పవర్ స్ట్రైకర్స్

📰 Generate e-Paper Clip

ఎలిగేన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజేత పవర్ స్ట్రైకర్స్

బాలకృష్ణ సారథ్యంలో వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా పవర్ స్ట్రైకర్స్ ఘనవిజయం

లీగ్ నుంచి ఫైనల్ వరకు ఒక్క ఓటమి లేకుండా అద్భుత ప్రదర్శన

వికెట్ కీపింగ్‌లో నాగబాబు మెరుపులు… టోర్నీ బెస్ట్ కీపర్‌గా ప్రశంసలు

అత్యధిక పరుగులతో వినోద్, అత్యధిక వికెట్లతో దుర్గారావు సత్తా!

ఆల్‌రౌండర్ నరసింహ కీలక ప్రదర్శనతో జట్టు విజయాలకు బలమైన అండ

బండమందారంలోని శ్రీ వాసుదేవ క్రికెట్ గ్రౌండ్‌లో ఘనంగా ముగిసిన ఎలిగేన్స్ ప్రీమియర్ లీగ్–2 వేడుకలు

కుత్బుల్లాపూర్, జూలై 27 ( నమస్తే భరత్ ): బండమందారంలోని శ్రీ వాసుదేవ క్రికెట్ గ్రౌండ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఎలిగేన్స్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) సీజన్–2 ఘనంగా ముగిసింది. శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీలో ఐదు జట్లు క్రీడాస్ఫూర్తితో పోటీపడి అభిమానులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను అందించాయి. చివరికి బాలకృష్ణ నాయకత్వంలోని పవర్ స్ట్రైకర్స్ జట్టు అద్భుత సమిష్టి ప్రదర్శనతో వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన పవర్ స్ట్రైకర్స్ జట్టు ఎనిమిది పాయింట్లతో పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అత్యుత్తమ నెట్ రన్‌రేట్ నమోదు చేసిన ఈ జట్టు అనంతరం జరిగిన నాకౌట్ దశలోనూ అదే జోరును కొనసాగించింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయించి టోర్నీ మొత్తం ఒక్క ఓటమి కూడా లేకుండా విజేతగా అవతరించింది. టోర్నీలో మన్నే స్ట్రైకర్స్–11 జట్టు రన్నరప్‌గా నిలవగా, ద ఎలైట్స్ ఆఫ్ ఎలిగేన్స్, ఫియర్‌లెస్ వారియర్స్ (ఎంపీటీ), రాక్ స్టార్స్ జట్లు కూడా పోటీతత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రతి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాయి. జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోటీ ప్రేక్షకులను చివరి బంతి వరకు ఉత్కంఠలో ముంచెత్తింది. పవర్ స్ట్రైకర్స్ విజయానికి ఆటగాళ్ల సమిష్టి కృషే ప్రధాన బలంగా నిలిచింది. ఆల్‌రౌండర్ నరసింహ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కీలక ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. వినోద్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలవగా, దుర్గారావు అత్యధిక వికెట్లు పడగొట్టి బౌలింగ్ విభాగంలో తన సత్తాను చాటుకున్నాడు. ఇక వికెట్ల వెనుక నాగబాబు ప్రదర్శించిన చురుకుదనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెరుపువేగంతో చేసిన స్టంపింగ్స్, అద్భుత క్యాచ్‌లు, ఖచ్చితమైన వికెట్ కీపింగ్‌తో ప్రేక్షకులు, నిర్వాహకులు, సహచర ఆటగాళ్ల ప్రశంసలు అందుకున్న ఆయన టోర్నీ అత్యుత్తమ వికెట్ కీపర్ అవార్డును దక్కించుకున్నాడు. పవర్ స్ట్రైకర్స్ వరుస విజయాల్లో నాగబాబు పాత్ర విశేషమని క్రీడాభిమానులు కొనియాడారు. టోర్నీ మొత్తం యువ క్రికెటర్ల ప్రతిభ, జట్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ, క్రీడాస్ఫూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ రేకెత్తించడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఇలాంటి టోర్నీలు కీలక పాత్ర పోషిస్తాయని పలువురు క్రీడాభిమానులు అభిప్రాయపడ్డారు. టోర్నీని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకుడు శ్రీనివాస్ యాదవ్తో పాటు కమిటీ సభ్యులను పాల్గొన్న జట్లు, క్రీడాకారులు, అభిమానులు అభినందించారు. భవిష్యత్తులో ఎలిగేన్స్ ప్రీమియర్ లీగ్ను మరింత ఉన్నత స్థాయిలో నిర్వహించి యువ క్రీడాకారులకు జాతీయ స్థాయి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!