మిషన్ ఇంద్రధనస్సు, కుష్టు వ్యాధి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాష్

ఖానాపురం అక్టోబర్ 23(మల్లేష్ నమస్తే భారత్) :
ఖానాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాష్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం మిషన్ ఇంద్రధనస్సు అమలు తీరును సమీక్షించారు. అనంతరం మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం నిర్వహిస్తున్న ధర్మారావుపేట సబ్‌సెంటర్‌ను సందర్శించి, టీకాల పంపిణీపై వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ.. సాధారణ టీకాల కార్యక్రమంలో భాగంగా టీకాలు వేయించుకోని పిల్లలు, గర్భిణులను గుర్తించి, వారికి తప్పనిసరిగా టీకాలు వేయించడమే మిషన్ ఇంద్రధనస్సు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాధి నిరోధక టీకాలు అందేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
*కుష్టు వ్యాధి గుర్తింపునకు 14 రోజుల ఇంటింటి సర్వే* :
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శనివారం నుంచి 14 రోజులపాటు ఎల్‌సీడీసీ (లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి కుష్టు వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు అనుమానిత కేసులను గుర్తిస్తారని వివరించారు.
శరీరంపై స్పర్శలేని మచ్చలు, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, నరాల బలహీనత, స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, తదుపరి పరీక్షలు, చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించాలని సూచించారు. కుష్టు వ్యాధికి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయని, వ్యాధి పట్ల భయాందోళనలు అవసరం లేదని పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు పూర్తిస్థాయిలో చికిత్స తీసుకుంటే వ్యాధిని నయం చేయవచ్చని తెలిపారు. కుష్టు రహిత సమాజ సాధనే ఈ కార్యక్రమం లక్ష్యమని స్పష్టం చేశారు.
*ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి* :
ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితుల్లో వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ ప్రకాష్ సూచించారు. ప్రజలు ఎక్కువగా నీరు తాగాలని, మధ్యాహ్న సమయంలో ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందాలని సూచించారు. వేసవి కాలంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలోఖానాపురం పిహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి, సబ్‌యూనిట్ ఆఫీసర్ నంద, వైద్య సిబ్బంది శ్రీనివాస చారి, దేవిక, చిన్ని, సబిత, ప్రతిభ, భాస్కర్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



