ప్రగతి నగర్‌లో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం

అధికారులతో కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సమీక్ష
స్టోరేజ్ ట్యాంక్‌ను పరిశీలించి సమస్యలపై చర్చ
ట్యాంకర్ల మార్గమార్పుపై ప్రతిపాదనలు – రహదారి సౌకర్యాల కల్పనకు కృషి
విద్యుత్ సమస్య పరిష్కారానికి శాఖల సమన్వయంపై దృష్టి
కుత్బుల్లాపూర్, జూన్ 19 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రగతి నగర్ డివిజన్–276 పరిధిలో నెలకొన్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) సీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్, జనరల్ మేనేజర్ నాగ పరిమళతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం సూరవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని స్టోరేజ్ ట్యాంక్‌ను పరిశీలించి, ప్రగతి నగర్ ప్రాంతంలో నెలకొన్న తాగునీటి కొరతపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రగతి నగర్ ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యను అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మోర్ సూపర్ మార్కెట్ వెనుక ఉన్న నిల్వ ట్యాంకులకు వెళ్తున్న వాటర్ ట్యాంకర్లను సూరవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని స్టోరేజ్ ట్యాంక్‌కు మళ్లించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఇందుకు అవసరమైన పరిపాలనా చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు తెలిపారు. అయితే, స్టోరేజ్ ట్యాంక్ వరకు ట్యాంకర్లు చేరుకునేందుకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడం ప్రధాన అవరోధంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశాన్ని సంబంధిత మంత్రి, విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకెళ్లి రహదారి నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని హన్మంత్ రెడ్డి తెలిపారు. అలాగే, ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల నీటి సరఫరా నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసి సమస్యను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు నిరంతరాయంగా మంచినీటి సరఫరా అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.



