జీడిమెట్ల పరిశ్రమలు మరిన్ని ఉద్యోగాలకు నాంది పలకాలి



పీఎంవీబీఆర్‌వై పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపు
ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన లబ్ధిదారులకు ప్రోత్సాహక నగదు పంపిణీ
కేపీ సర్కిల్ పరిధిలో 242 సంస్థలకు రూ.2.39 కోట్ల ప్రోత్సాహకాలు
9,841 మంది ఉద్యోగులకు రూ.5.29 కోట్ల ప్రయోజనం
ఉపాధి, పరిశ్రమల అభివృద్ధి, వికసిత్ భారత్ లక్ష్యానికి పథకం దోహదం
కుత్బుల్లాపూర్, జూన్ 19 ( నమస్తే భరత్ ): జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎంవీబీఆర్‌వై) పథకాన్ని సద్వినియోగం చేసుకుని మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్‌లో ప్రాంతీయ ఉపాధి కార్యాలయం (ఆర్‌ఓ), కూకట్‌పల్లి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన లబ్ధిదారులకు ప్రోత్సాహక నగదు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రోత్సాహక నగదు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తున్న యువతకు ప్రోత్సాహం అందించేందుకు మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి రూ.15 వేల వరకు ఒకేసారి ప్రోత్సాహక నగదు అందించడం ఈ పథకం ప్రత్యేకత అని తెలిపారు. దీని ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం పెరిగి, ఉద్యోగ రంగంలో మరింత సమర్థవంతంగా రాణించే అవకాశం లభిస్తుందన్నారు.
అదనపు ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఉపాధి సృష్టిని వేగవంతం చేయడంతో పాటు అధికారిక ఉద్యోగ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కూకట్‌పల్లి (కేపీ) సర్కిల్ పరిధిలోని కుత్బుల్లాపూర్ జోన్‌తో కలిపి ఈ పథకం ద్వారా 242 మంది యజమానులు సుమారు రూ.2.39 కోట్ల ప్రోత్సాహకాలను పొందగా, 9,841 మంది ఉద్యోగులు రూ.5.29 కోట్ల మేర ప్రయోజనం పొందినట్లు వెల్లడించారు. ఈ గణాంకాలు పరిశ్రమలు, యువత ఉపాధి కల్పనలో చురుకైన భాగస్వాములుగా నిలుస్తున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ పథకం ద్వారా మరిన్ని సంస్థలు లబ్ధి పొందడంతో పాటు స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తయారీ రంగంలోని సంస్థలకు నాలుగేళ్లపాటు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా కొత్త పరిశ్రమల స్థాపనకు, ఇప్పటికే ఉన్న పరిశ్రమల విస్తరణకు ఈ పథకం దోహదపడుతుందని తెలిపారు. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలుస్తోందని, ఇక్కడి పరిశ్రమలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మరింత ఉపాధి కల్పనకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ సురేందర్ కుమార్, పీఎఫ్ ఉప కమిషనర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, ఎన్‌ఐసీ హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్, జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. సాయి కిషోర్, అసోసియేషన్ సభ్యులు, పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



