యోగాతో ఆరోగ్యమే మహాభాగ్యం


అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యోగా ఆసనాలు, ప్రాణాయామ ప్రదర్శనలు
అసంక్రమిత వ్యాధుల నివారణలో యోగా కీలకమని వైద్యుల సూచన
ప్రతి ఒక్కరూ రోజూ 30 నిమిషాలు యోగా చేయాలని పిలుపు
అల్వాల్, జూన్ 21 ( నమస్తే భరత్): అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై-2026) సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సి. ఉమా గౌరి నాయకత్వంలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) ప్రోగ్రామ్ అధికారి డా. చంద్రకళ మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని పేర్కొన్నారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను సాధించే సమగ్ర జీవన విధానమని తెలిపారు. ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను అధిగమించవచ్చని చెప్పారు. అలాగే మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు వంటి అసంక్రమిత వ్యాధుల నివారణలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్న ఆమె, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 30 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యతను పొందవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని విద్యార్థులు, యువత, ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన విధానాలను ప్రదర్శించి, యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. లావణ్య రెడ్డి, జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డా. శ్రీదేవి, డా. నాగరాజ్, డిప్యూటీ కమిషనర్ బోగేశ్వర్, అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. గోలి శ్రీకాంత్, ఆయుష్ విభాగానికి చెందిన ఆయుర్వేద వైద్యాధికారి డా. శ్రీదేవి, హోమియో వైద్యాధికారి డా. అనఘ్, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.



