ePaper
Tuesday, August 4, 2026
ePaper
Homeఎడిటోరియల్వాజ్పాయ్ నగర్‌ను ముంచెత్తిన వరద... అధికారుల నిర్లక్ష్యానికి బస్తీవాసుల బలి!

వాజ్పాయ్ నగర్‌ను ముంచెత్తిన వరద… అధికారుల నిర్లక్ష్యానికి బస్తీవాసుల బలి!

📰 Generate e-Paper Clip

వాజ్పాయ్ నగర్‌ను ముంచెత్తిన వరద… అధికారుల నిర్లక్ష్యానికి బస్తీవాసుల బలి!

– అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్ల పనులతో జలమయం అయిన కాలనీలు
– వర్షపు నీరు నిలిచిపోవడంతో నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు
– పూర్తిగా దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థతో మరింత తీవ్రంగా సమస్య
– నెలలుగా పూర్తి కాని అభివృద్ధి పనులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
– మధ్యతరగతి కుటుంబాల దైనందిన జీవనానికి తీవ్ర అంతరాయం
– రెండు, మూడు గల్లీలకే పరిమితమైన రోడ్లు… మిగతా వీధులు బురదమయమే
– దోమలు, దుర్వాసన, వ్యాధుల భయంతో వణికిపోతున్న బస్తీవాసులు
– వెంటనే స్పందించి పనులు పూర్తి చేయాలని అధికారులను కోరుతున్న స్థానికులు

కుత్బుల్లాపూర్, ఆగస్టు 4: ( నమస్తే భరత్ ); కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వాజ్పాయ్ నగర్‌లో అర్ధాంతరంగా నిలిచిపోయిన రోడ్ల నిర్మాణ పనులు బస్తీవాసులకు శాపంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న మధ్యతరగతి కుటుంబాలు నిత్యజీవితాన్ని కొనసాగించడమే కష్టసాధ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సీఎంసీ అధికారులు నెలల క్రితం రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ కేవలం కొన్ని గల్లీల్లో మాత్రమే పనులు పూర్తి చేసి, మిగిలిన వీధులను అర్ధాంతరంగా వదిలేయడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పలు గల్లీలు చెరువులను తలపించేలా మారాయి. ఇక ఇప్పటికే దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవడంతో వర్షపు నీరు, మురుగునీరు కలిసి రోడ్లపైనే నిలిచిపోతోంది. దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమల విజృంభణ పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, ఉద్యోగులు ప్రతి రోజూ నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు కూడా కాలనీలోకి రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని బస్తీవాసులు వాపోతున్నారు. అధికారులు ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తిచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి, నిల్వ ఉన్న వరదనీటిని తొలగించాలని బస్తీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాల కంటే నిర్లక్ష్యమే ముఖ్యమా? అనే ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!