సీఎం సహాయనిధితో పేద కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక చేయూత
-జగద్గిరి నగర్‌కు చెందిన మహిళ చికిత్స కోసం మంజూరు
-సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చొరవతో అందిన సహాయం
-పేదల ఆరోగ్య అవసరాలకు సీఎం రిలీఫ్ ఫండ్‌ను వినియోగిస్తున్న సీపీఐ
-రెండేళ్లలో కుత్బుల్లాపూర్‌లో పలువురికి లబ్ధి చేకూరిందన్న ఉమామహేష్
-ప్రజా సమస్యల పరిష్కారంలో సీపీఐ సేవలు కొనసాగుతాయని వెల్లడి
కుత్బుల్లాపూర్, జులై 14 ( నమస్తే భరత్); పేద ప్రజలకు వైద్య చికిత్స భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతో ఉపయోగపడుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్‌లోని జగద్గిరి నగర్‌కు చెందిన కావలి బాబు సతీమణి తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సహాయం సీపీఐ ఎమ్మెల్యే, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు చొరవతో అందిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు సహకరించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు, సీపీఐ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమామహేష్ మాట్లాడుతూ, పేద ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని చెప్పారు. గత రెండేళ్లుగా జగద్గిరిగుట్ట డివిజన్‌తో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనేక మంది నిరుపేదలకు సీఎం సహాయనిధి ద్వారా వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందేలా కృషి చేశామని తెలిపారు. ఈ సహాయం ద్వారా లబ్ధి పొందిన ప్రజలు పార్టీపై విశ్వాసం వ్యక్తం చేస్తుండటం సంతోషకరమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే సీపీఐ ప్రధాన ధ్యేయమని, ప్రజలు కూడా పార్టీ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మద్దతు తెలుపుతూ సామాజిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి రాములు, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, యువజన సంఘం కార్యదర్శి వెంకటేష్, శాఖ నాయకులు చంద్రయ్య, కరుణాకర్, బాలకృష్ణ, చంద్రమ్మతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



