*కేసీఆర్ ప్రభుత్వంలోనే రైతులకు నిజమైన మేలు*

*షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్*
*రైతుబంధును ఏకకాలంలో విడుదల చేయాలి*
*రైతులకు యాప్ అవసరం లేదు.. ఎరువులు అందుబాటులో ఉంచాలి*
*వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే సహించబోం*
*అన్ని రకాల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలి*
*కాంగ్రెస్ హయాంలో ఎరువుల కరువు..*
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్20:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వ్యవసాయ రంగానికి జరిగిన మేలును తెలంగాణ రైతాంగం ఎన్నటికీ మర్చిపోదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు అదే స్థాయిలో మేలు చేసే విధంగా పాలన అందించాలని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగానికి నాణ్యమైన, అంతరాయం లేని 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించడం వల్ల రైతులు రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లే ఇబ్బందులు తప్పాయని గుర్తు చేశారు. ప్రస్తుతం నాణ్యమైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో పాటు విద్యుత్ కోతలు పెరిగాయని ఆరోపించారు. రైతుబంధు పథకం ద్వారా ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.10 వేల పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం వల్ల విత్తనాలు, ఎరువుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం ఏకకాలంలో అందడం లేదని విమర్శించారు. రైతుబంధు నిధులను గతంలో మాదిరిగానే ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబ సభ్యులకు వారం రోజుల్లోగా రూ.5 లక్షల బీమా సాయం అందేలా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మిషన్ కాకతీయతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా బీడు భూములకు సైతం సాగునీరు అందిందని, దీంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అనేక లిఫ్టులను పూర్తి చేశారని, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తికాకపోయినా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలు, చర్యలు గత ప్రభుత్వ హయాంలోనే చేపట్టినట్లు గుర్తు చేశారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఆలోచన కూడా కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించిందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని, ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో కొన్ని రకాల పంటలను మాత్రమే కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. ప్రభుత్వం అన్ని రకాల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మార్కెట్లకు భారీగా ధాన్యం వచ్చినా కొనుగోలు ప్రక్రియను సమర్థంగా నిర్వహించేవారని, ప్రస్తుతం వచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రైతులకు న్యాయం జరిగిందని అన్నారు. ఎరువుల కొనుగోలు కోసం యాప్ విధానాన్ని తీసుకురావడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో ఎంతోమంది రైతులకు చదువు రాకపోవడంతో యాప్ ఆధారిత విధానం వారికి ఇబ్బందికరంగా మారుతుందని, వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎరువుల కొరత ఏర్పడిందని ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలను రైతాంగం సహించబోదని హెచ్చరించిన అంజయ్య యాదవ్, ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, ఈట గణేష్, నటరాజన్, లక్ష్మణ్ నాయక్, దేవేందర్ యాదవ్, చీపిరి రవి యాదవ్, నక్కల వెంకటేష్, యాదగిరి, గోవిందు అశోక్, గోపాల్, ఎస్పీ శివ, జెట్ట కుమార్, యుగంధర్, రామకృష్ణ, అశోక్, బాబ ఘోరీ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



