*దేవని సతీష్ మాదిగకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి*
*30 ఏళ్ల సామాజిక ఉద్యమ సేవలను గుర్తించాలి: సామాజిక ఉద్యమ నాయకులు చిన్నోళ్ల అనంతయ్య*
నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్29: తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో గవర్నర్ కోటాలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన దేవని సతీష్ మాదిగకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని సామాజిక ఉద్యమ నాయకులు చిన్నోళ్ల అనంతయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ఉద్యమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ సుమారు 30 సంవత్సరాలుగా సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు నిర్వహించిన సతీష్ మాదిగకు ప్రత్యేక గుర్తింపు ఉందని అనంతయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ప్రత్యేక కార్యాచరణతో ఉద్యమాలు నిర్వహించి, రాష్ట్ర ఏర్పాటు వరకు పోరాటం చేశారని తెలిపారు.అంటరానితనం, కుల వివక్ష, అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలకు వ్యతిరేకంగా సతీష్ మాదిగ నిరంతరం ప్రజల తరఫున నిలబడి ఉద్యమాలను ముందుకు నడిపించారని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాదిగ సామాజిక వర్గానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కలేదనే అభిప్రాయం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. దేవని సతీష్ మాదిగకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ద్వారా సామాజిక న్యాయం, అణగారిన వర్గాల ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామనే సందేశాన్ని ప్రభుత్వం ఇవ్వాలని చిన్నోళ్ల అనంతయ్య విజ్ఞప్తి చేశారు.



