నిరుద్యోగుల హామీల అమలే లక్ష్యంగా బీఆర్ఎస్ ‘ఛలో సరూర్‌నగర్’ సన్నాహాలు

-జూలై 18న సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు
-ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు
-సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, పలువురు నేతలు
-యూత్ డిక్లరేషన్ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శ
-నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్న బీఆర్ఎస్
-విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం
-యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నేతల పిలుపు
-సదస్సు విజయవంతానికి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
కుత్బుల్లాపూర్, జులై 14 ( నమస్తే భరత్); నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “ఛలో సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సు” ఏర్పాట్లను బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం పరిశీలించారు. సదస్సును విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, ప్రజల రాకపోకలు, భద్రత, పార్కింగ్ తదితర అంశాలపై నాయకులు అధికారులతో, నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు మాట్లాడుతూ, 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రకటించిన ‘యూత్ డిక్లరేషన్లో ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, యువత సంక్షేమానికి సంబంధించిన హామీలను అమలు చేయకుండా విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు హామీల అమలుకు ఒత్తిడి తీసుకురావడమే యువ సంగ్రామ సదస్సు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. యువత పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. స్టేడియం పరిశీలనలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నోముల భగత్, బంటి, అవినాష్ రెడ్డి, ముఠా జైసింహా, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, బాలరాజు యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్, మాజీ ఎస్సీ కమిషన్ సభ్యుడు విద్యాసాగర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా. కురువ విజయ్ కుమార్, ధర్మేందర్ రెడ్డి, తుంగబాలు, కాడరి స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



