ఆరోగ్యమంతమైన బిడ్డకు పునాది తల్లిపాలే


జె.శ్రీనివాసులు హెల్త్ ఎడ్యుకేటర్
సంధ్య అంగన్వాడి సూపర్వైజర్
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 05: బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు ఏరియా సబ్ సెంటర్ “ఎ ” అర్బన్ 2వ అంగన్వాడి సెంటర్ లో ప్రపంచ తల్లిపాల వారోత్సవం లో భాగంగా అంగన్వాడి టీచర్ పద్మ ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవం యొక్క కార్యక్రమంలో, తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు తెలియజేశారు. ప్రతి సంవత్సరము ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తాము అని, ఈ వారవోత్సవం ముఖ్య ఉద్దేశము తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడం జరుగుతుందని మరియు ప్రతి శిశువుకు తల్లిపాలు అందేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారమని, మొదటి 6 నెలలు వరకు శిశువుకు తల్లిపాలు తప్పకుండా పట్టించాలి అని చెప్పారు. పాప పుట్టిన వెంటనే వచ్చే మురుపాలు శిశువుకు అమృతముతో సమానము అని, ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని తెలియజేశారు. తల్లిపాలు తాగే పిల్లలకు విరేచనాలు, నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తక్కువ అని, శిశువు మెదడు ఎదుగుదలకు, శారీరక మరియు మానసిక అభివృద్ధికి తల్లిపాలు ఎంతో అవసరమని, తల్లి బిడ్డల మధ్య ప్రేమ అనుబంధం మరింత బలపడుతుందని, తల్లిపాలు ఎల్లప్పుడూ పరిశుభ్రమైనవి అని, ఈ పాలు సరైన ఉష్ణోగ్రతలో ఉంటాయని, వీటికి ఎలాంటి ఖర్చు ఉండదని హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు తెలియజేశారు. తల్లి పాపకు పాలు ఇవ్వడం వలన ప్రసవం తర్వాత గర్భాశయం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుందని, ప్రసవానంతరo రక్తస్రావం తగ్గుతుందని, రొమ్ము క్యాన్సర్లు, అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని మరియు తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలియజేశారు. మరియు శిశువు పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ప్రారంభించాలని, మొదటి ఆరు నెల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అని, నీరు లేదా ఇతరహారము అవసరము లేదని హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు చెప్పారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్య మాట్లాడుతూ గర్భవతులందరూ అంగన్వాడి సెంటర్ లో ఇచ్చే బాలామృతము, గుడ్లు మరియు మురుకులు తప్పకుండా తీసుకొని, తినాలని తెలియజేశారు. వీటివలన తల్లికి , బిడ్డకు కావలసిన పోషకాహారం అందుతుందని చెప్పారు. తల్లులు పాపకు పాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా పట్టించి పాలు. తాగిన తర్వాత , పాపను భుజంపై వేసుకొని వీపు తట్టాలని తెలియజేశారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఆరోగ్య సిబ్బంది ఇచ్చే ఐరన్ మాత్రలు రెగ్యులర్గా తీసుకోవాలని తెలియజేశారు. తదుపరి అక్కడికి వచ్చిన బాబుకు హెల్త్ ఎడ్యుకేటర్ జె .శ్రీనివాసులు బాల అమృతం తినిపించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు, అంగన్వాడి సూపర్వైజర్ సంధ్య, 19 వార్డ్ కౌన్సిలర్ ఆరిఫా బేగం, 20 వార్డు కౌన్సిలర్ పి.గోపాల్, అంగన్వాడి టీచర్స్ పద్మ, కవిత, రాధాదేవి , జయమ్మ , శ్రీదేవి, ఏ.ఎన్.ఎమ్. ఇస్తే రాణి, అంగన్వాడి ఆయా కళావతి, మరియు ఆశలు, గర్భవతులు మరియు బాలింత తల్లులు పాల్గొన్నారు.



