మోత్కూలగూడలో భక్తిశ్రద్ధలతో ఘనంగా మైసమ్మ, పోచమ్మ తల్లి బోనాలు

తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా మోత్కూలగూడలో బోనాల మహోత్సవం
సర్పంచ్ జెట్ట లావణ్య రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా మైసమ్మ బోనాలు
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 04:షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం మోత్కూలగూడ గ్రామంలో మైసమ్మ, పోచమ్మ తల్లి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జెట్ట లావణ్య రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజుల సయ్యాట, డప్పు వాయిద్యాలు, జానపద కళారూపాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల జైజై ధ్వానాలతో గ్రామం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ సందర్భంగా సర్పంచ్ జెట్ట లావణ్య రమేష్ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇటువంటి ఆధ్యాత్మిక వేడుకలు సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వానరసి నర్సింహా , మాజీ సర్పంచ్ ఎల్లమ్మ నరసింహ, వార్డు సభ్యులు, పార్టీలకు అతీతంగా గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు.



