*ఫరూక్‌నగర్ హైస్కూల్లో ఎన్‌సీసీ విద్యార్థులకు టీబీ ముక్త భారత్‌పై అవగాహన


*టీబీని దాచకండి.. పరీక్ష చేయించుకోండి*
*షాద్ నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి*
నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్18:ఫరూక్‌నగర్ ఉన్నత పాఠశాలలో ఎన్‌సీసీ విద్యార్థులకు నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా టీబీ ముక్త భారత్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలోని వ్యక్తులు, సంస్థలు, యువత, విద్యాసంస్థలు టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు.
క్షయవ్యాధి మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని, ముఖ్యంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని తెలిపారు. దీర్ఘకాలంగా దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చని చెప్పారు. రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం దగ్గు ఉన్నవారు తప్పనిసరిగా సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఎన్‌సీసీ విద్యార్థులు టీబీపై అవగాహన ర్యాలీలు నిర్వహించడం, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేయడం, కుటుంబాలు మరియు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం, అనుమానితులను ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేలా ప్రోత్సహించడం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని శ్రీనివాసులు తెలిపారు. టీబీ రోగుల పట్ల వివక్ష చూపకుండా వారికి సహకరించాలని, చికిత్సను మధ్యలో నిలిపివేయకుండా పూర్తిగా కొనసాగించేలా ప్రోత్సహించాలని సూచించారు.
“టీబీని దాచకండి.. పరీక్ష చేయించుకోండి.
చికిత్సను మధ్యలో ఆపకండి.. పూర్తిగా తీసుకోండి.
టీబీ రోగిని దూరం చేయకండి.. చేయూతనివ్వండి.
మనమంతా కలిసి నిర్మిద్దాం.. టీబీ ముక్త భారత్” అని ఆయన పిలుపునిచ్చారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వి. విజయలక్ష్మి మాట్లాడుతూ టీబీకి ప్రస్తుతం సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. వైద్యుల సూచనల మేరకు మందులను సరైన మోతాదులో, నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. వ్యాధి తీవ్రతను బట్టి సాధారణంగా ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం చికిత్స కొనసాగవచ్చని తెలిపారు.
కొన్ని రకాల టీబీ బ్యాక్టీరియాలు సాధారణ మందులకు స్పందించకపోవచ్చని, దీనిని ఔషధ నిరోధక టీబీగా పరిగణిస్తారని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, నిపుణుల పర్యవేక్షణలో తగిన చికిత్స అందిస్తారని వివరించారు. చికిత్సతో పాటు పోషకాహారం తీసుకోవాలని, మందులను సమయానికి వేసుకోవాలని, పొగతాగడం, మద్యం సేవించడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు, టీబీ సూపర్‌వైజర్ రవికుమార్, పాఠశాల ఎన్‌సీసీ మాస్టర్ విష్ణువర్ధన్, పీపీ యూనిట్ ఆశా కార్యకర్తలు, ఫరూక్‌నగర్ ఉన్నత పాఠశాల ఎన్‌సీసీ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.



