ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి
అక్రమ నిర్మాణాలు కూల్చి.. ఆక్రమణదారులను అరెస్ట్ చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్
➤ జగద్గిరిగుట్ట సర్వే నంబర్ 348/1 ప్రభుత్వ భూములను వెంటనే పరిరక్షించాలని డిమాండ్
➤ జాంబవంతుని గుడి స్థలంలో మళ్లీ కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై ఆందోళన
➤ హైకోర్టు ఆదేశాల మేరకు ఆలయ భూములను సర్వే చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి
➤ రాజీవ్ గృహకల్ప షాపింగ్ కాంప్లెక్స్ భూముల ఆక్రమణలపై విచారణ చేపట్టాలని డిమాండ్
➤ నకిలీ పట్టాల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచన
➤ వేద పాఠశాల మార్గం, సోమయ్యనగర్ ప్రాంతాల్లో జరుగుతున్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని విజ్ఞప్తి
జగద్గిరిగుట్ట, ఆగస్టు 7 ( నమస్తే భరత్ ); జగద్గిరిగుట్టలో ప్రభుత్వ భూములపై పెరుగుతున్న ఆక్రమణలను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ ప్రభుత్వాన్ని కోరారు. జగద్గిరిగుట్ట సర్వే నంబర్ 348/1లోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మార్వో రాజేష్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉమా మహేష్ మాట్లాడుతూ, జాంబవంతుని గుడి స్థలంలో గతంలో అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించినప్పటికీ, తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆక్రమణలు జగద్గిరిగుట్టలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయని, కేవలం కూల్చివేతలతో సరిపెట్టకుండా ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన భూములను హైకోర్టు ఆదేశాల మేరకు వెంటనే సర్వే నిర్వహించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని కోరారు. లేదంటే ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, భవిష్యత్ తరాలకు ప్రభుత్వ ఆస్తులు అందుబాటులో లేకుండా పోతాయని హెచ్చరించారు. రాజీవ్ గృహకల్పలోని షాపింగ్ కాంప్లెక్స్‌కు కేటాయించిన భూములను పట్టాల పేరుతో ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత పట్టాల ప్రామాణికతను అధికారులు సమగ్రంగా పరిశీలించి, నకిలీ పట్టాలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సోమయ్యనగర్‌లోని సలాసర్ పేరుతో ఉన్న భూమిని చిన్నచిన్న ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, అలాగే వేద పాఠశాలకు వెళ్లే మార్గం పక్కన కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఆక్రమణలను వెంటనే తొలగించి ప్రభుత్వ భూములను రక్షించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి స్వామి, సహాయ కార్యదర్శి రాములు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మండల కోశాధికారి సదానందం తదితరులు పాల్గొన్నారు.



