ePaper
Sunday, July 26, 2026
ePaper
Homeఎడిటోరియల్షామీర్‌పేట్ ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు శ్రీకారం

షామీర్‌పేట్ ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

షామీర్‌పేట్ ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు శ్రీకారం

2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానం

ఆగస్టు 1 నుంచి తరగతుల ప్రారంభం

ఎలక్ట్రిషియన్, ఫిట్టర్‌తో పాటు ఆధునిక సాంకేతిక కోర్సులు అందుబాటులో

పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు అవకాశం

ఉపాధి, అప్రెంటిస్‌షిప్ అవకాశాలకు బాటలు వేసే శిక్షణ

పేట్ బషీరాబాద్, జూన్ 20 ( నమస్తే భరత్ ): మెడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని షామీర్‌పేట్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో సంప్రదాయ ట్రేడ్లతో పాటు ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పలు సాంకేతిక కోర్సుల్లో విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ వెల్లడించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులు. ప్రవేశాలు పూర్తిగా మెరిట్ ఆధారంగా నిర్వహించబడతాయని, ఎంపికైన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐలో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ వంటి సంప్రదాయ ట్రేడ్లతో పాటు అడ్వాన్స్్డ్ సిఎన్‌సి మెషినింగ్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఎంఈవీ), ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, బేసిక్ డిజైన్ అండ్ వర్చువల్ వెరిఫికేషన్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో కీలకంగా నిలుస్తాయని తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వారికి అప్రెంటిస్‌షిప్ అవకాశాలతో పాటు స్వయం ఉపాధి, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. ప్రవేశాల కోసం విద్యార్థులు ఎస్ఎస్‌సీ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, బోనాఫైడ్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, ఫొటోలు తదితర పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ ఐటీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా షామీర్‌పేట్ ప్రభుత్వ ఐటీఐను సంప్రదించాలని సూచించారు. ప్రిన్సిపాల్ హరి కృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులు అందుబాటులో ఉన్న సీట్లను సద్వినియోగం చేసుకుని నైపుణ్య శిక్షణ ద్వారా తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే ప్రభుత్వ ఐటీఐల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!