ఘట్‌కేసర్ తహసీల్దార్ కార్యాలయంపై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
◉ సాదాబైనామా, భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
◉ గ్రామాల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు
◉ ఎలక్టోరల్ ఎన్రోల్మెంట్ (ఎస్ఈఆర్) డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి
◉ భూ భారతి పోర్టల్ సమస్యల పరిష్కారానికి కీలక సూచనలు
◉ పెండింగ్‌కు గల కారణాలపై అధికారులను ప్రశ్నించిన అదనపు కలెక్టర్
◉ ప్రజలకు వేగవంతమైన సేవలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం
కుత్బుల్లాపూర్, జూలై 30 ( నమస్తే భారత్ ): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాదాబైనామా, భూ భారతి పెండింగ్ దరఖాస్తులు, గ్రామాల రీసర్వే, ఎలక్టోరల్ ఎన్రోల్మెంట్ (ఎస్ఈఆర్) ప్రక్రియల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. సాదాబైనామా, భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. పెండింగ్‌కు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని, నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి సమగ్ర భూమి రికార్డుల పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనా సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన సూచనలు జారీ చేశారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. గ్రామాల రీసర్వే పనులను వేగవంతం చేయడంతో పాటు ఎలక్టోరల్ ఎన్రోల్మెంట్ (ఎస్ఈఆర్) ప్రక్రియలో భాగమైన డిజిటలైజేషన్‌ను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఘట్‌కేసర్ తహసీల్దార్ చంద్రశేఖర్‌తో పాటు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.



