ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
బీఆర్ఎస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ
బత్తిని శ్రీనివాస్ గౌడ్
నర్సంపేట, అక్టోబర్ 30 (నమస్తే భారత్) : తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఏయే పథకాల ద్వారా ఎంత ఖర్చు చేశారో ప్రజలకు వెల్లడించాలని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ, బీసీ రాష్ట్ర నాయకులు, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
2023 ఆగస్టు 26న చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లోని 12 సూత్రాలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు అమలు చేశారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు.
ఎస్సీ సంక్షేమం కోసం 2024లో రూ.33,124 కోట్లు, 2025లో రూ.40,232 కోట్లు, 2026లో రూ.11,784 కోట్లు కలిపి మొత్తం రూ.85,140 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్టీ సంక్షేమం కోసం 2024లో రూ.17,056 కోట్లు, 2025లో రూ.17,169 కోట్లు, 2026లో రూ.7,937 కోట్లు కలిపి మొత్తం రూ.42,162 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ నిధులను ఏయే సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించారో పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో భాగంగా ఆయా వర్గాల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి రూ.10 వేలు, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి రూ.15 వేలు, డిగ్రీ పూర్తి చేసిన వారికి రూ.25 వేలు, పీజీ పూర్తి చేసిన వారికి రూ.లక్ష, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి రూ.5 లక్షల ప్రోత్సాహకాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. చదువుకున్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కూడా ప్రకటించిందని, ఈ హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆర్థికంగా ప్రోత్సహిస్తామని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని అన్నారు. ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఉచిత ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించారని, ఇప్పటివరకు ఎంతమందికి ఇంటి స్థలాలు, ఇళ్లు మంజూరు చేశారు, ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సి ఉంది, ఎప్పటిలోగా అందిస్తారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్‌లో నిధులు కేటాయించడం మాత్రమే కాకుండా, అవి అర్హులైన పేద కుటుంబాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఉపాధి కోసం వలస వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అర్హులైన నిరుపేద కుటుంబాలను అంత్యోదయ కార్డుల పరిధిలోకి తీసుకువచ్చి కుటుంబ పోషణకు అవసరమైన నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ప్రకటించిన 12 సూత్రాలను అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధుల ఖర్చుపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున బత్తిని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.



