*ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలి*
*పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలి*
*డిమాండ్లు పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి సమ్మె*
*ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు సమ్మె నోటీసు అందజేసిన సీఐటీయూ, ఆశా వర్కర్ల నాయకులు*
నమస్తే భారత్ షాద్ నగర్,నవంబర్10:ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో 2026 డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తామని ఆశా వర్కర్ల జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు షాద్‌నగర్ శాసనసభ్యులు శ్రీ వీర్లపల్లి శంకర్‌ను కలిసి సమ్మె నోటీసును అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు ఎన్. రాజు, సహాయ కార్యదర్శి సాయిబాబు, శ్రీను నాయక్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలుగా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. వీరంతా ప్రధానంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలని, గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నారని అన్నారు.
గర్భిణులను ఆసుపత్రులకు తీసుకెళ్లి సురక్షిత ప్రసవాలు జరిగేలా చూడటంతో పాటు తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడటంలో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఆశా వర్కర్ల సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో ఆశా వర్కర్ల సేవలను గుర్తించినప్పటికీ రాష్ట్రంలో మాత్రం వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సబ్‌సెంటర్ డ్యూటీలు, ఏఎంసీలు, పీఎంసీలు, వివిధ టార్గెట్లు, ఎన్‌సీడీ సర్వేలు, ఆన్‌లైన్ పనులు, స్మోటం డబ్బాల సేకరణ, ఎగ్జామ్ డ్యూటీలు, డ్రై డే ఫ్రైడే, లెప్రసీ, పల్స్ పోలియో తదితర అనేక రకాల పనులను రాత్రి వరకు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇంతటి శ్రమ చేస్తున్న ఆశా వర్కర్లకు ప్రస్తుతం నెలకు కేవలం రూ.9,900 మాత్రమే పారితోషికం చెల్లిస్తున్నారని, ఇతర ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా పారితోషికాలు పెరగకపోవడంతో ఆశా వర్కర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఆశా వర్కర్ల ప్రధాన డిమాండ్లు:
ఆశా వర్కర్లకు నెలకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించి, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి.
రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.50 వేల అంత్యక్రియల ఖర్చులను వెంటనే మంజూరు చేయాలి.
పదవీ విరమణ సమయంలో రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి.ప్రతి ఆదివారం, పండుగలకు సెలవులు ఇవ్వాలి. సంవత్సరానికి 20 రోజుల క్యాజువల్ సెలవులు, ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, మెడికల్ సెలవులు కల్పించాలి.
ఏఎన్ఎం, జీఎన్ఎం శిక్షణ పూర్తి చేసిన ఆశా వర్కర్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి.
రెండో పీఆర్సీలో ఆశా వర్కర్లకు రూ.30,000 కనీస వేతనం నిర్ణయించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన రెండు డీఏలను ఆశా వర్కర్లకు కూడా వర్తింపజేయాలి.
ఆశా వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేయాలి.ప్రజాపాలనలో ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ఆశా వర్కర్లు పాల్గొన్నారు.



