బోధనలో నాణ్యతే లక్ష్యం.. టీచర్లకు మూడు రోజుల ప్రత్యేక శిక్షణ
• సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్’ కార్యక్రమం
• మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో 2,877 మంది ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ
• డీపీఎస్ నాచారం, జెడ్పీహెచ్ఎస్ నాగోల్, జెడ్పీహెచ్‌ఎస్ కూకట్‌పల్లి కేంద్రాల ఎంపిక
• జూలై 9 నుంచి తొలి విడత శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం
• జిల్లా, మండల స్థాయిల్లో రెండు విడతలుగా నిర్వహణ
• జూలై 30 నాటికి అన్ని సబ్జెక్టుల శిక్షణ పూర్తికి విద్యాశాఖ ప్రణాళిక
కుత్బుల్లాపూర్, జూలై 7 ( నమస్తే భరత్ ): ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల అభ్యాస ఫలితాలను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ‘ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ క్వాలిటీ లెర్నింగ్ త్రూ ట్రాన్స్‌ఫార్మేటివ్ క్లాస్‌రూమ్ ప్రాక్టీసెస్’ పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ మేరకు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని మొత్తం 2,877 మంది ఉపాధ్యాయులకు జిల్లా, మండల స్థాయిల్లో రెండు విడతలుగా శిక్షణ అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి విడత శిక్షణ జూలై 9 నుంచి ప్రారంభం కానుంది. శిక్షణ కోసం జిల్లాలోని డీపీఎస్ నాచారం, జెడ్పీహెచ్ఎస్ నాగోల్, జెడ్పీహెచ్ఎస్ కూకట్‌పల్లిలను కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఆయా కేంద్రాల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా విధానాలు, తరగతి గది నిర్వహణ, విద్యార్థి కేంద్రిత అభ్యాస పద్ధతులు, మూల్యాంకన విధానాలు తదితర అంశాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను జూలై 30 నాటికి పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా నిర్దేశించింది. ఈ శిక్షణ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ప్రమాణాలు మరింత మెరుగుపడి, విద్యార్థుల్లో నైపుణ్యాలు, అభ్యాస సామర్థ్యం పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) వెల్లడించారు.



