ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

-బాచుపల్లి ఎమ్మార్వోకు సీఐటీయూ వినతిపత్రం

-సంక్షేమ పథకాలను ప్రైవేట్ బీమా కంపెనీలకు అప్పగించవద్దని డిమాండ్

-జీఓ నెం.12ను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి

-సీఎస్‌సీ హెల్త్ టెస్టుల పేరుతో సంక్షేమ నిధుల దుర్వినియోగమని ఆరోపణ

-సహజ మరణ పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్

-60 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇవ్వాలని విజ్ఞప్తి

-సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిక

బాచుపల్లి, జూన్ 30 ( నమస్తే భరత్ ): భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బాచుపల్లి మండల ఎమ్మార్వో వాణి రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ బాచుపల్లి మండల కన్వీనర్ రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ, తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రైవేట్ బీమా కంపెనీలకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన జీఓ నెం.12ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు ద్వారానే కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అందించాలని, సీఎస్‌సీ హెల్త్ టెస్టుల పేరుతో కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా సంక్షేమ నిధులు వృథా చేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించి నిధులు విడుదల చేయాలని కోరారు. సహజ మరణ పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచాలని, 60 సంవత్సరాలు పూర్తిచేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.6 వేల పింఛన్ అందించాలని, అర్హులైన కార్మికులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. జూలై 22, 2025న ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.12 ద్వారా ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత, పాక్షిక అంగవైకల్య పథకాలను ప్రైవేట్ బీమా సంస్థల ద్వారా అమలు చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. అనంతరం ట్రెయిల్ బ్లెజర్ బ్రోకర్స్ సంస్థ ద్వారా వందల కోట్ల రూపాయలను ప్రైవేట్ బీమా కంపెనీలకు బదిలీ చేశారని ఆరోపించారు. కేంద్ర చట్టాలు, రాష్ట్ర సంక్షేమ బోర్డు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ చర్యలు చేపట్టడం కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకుడు వెంకట్రాజ్యం, మండల నాయకులు పి. భాస్కర్, పి. స్వామి, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!