పేదల ప్రాణాలకు భరోసా.. సీఎం సహాయనిధితో రూ.6 లక్షల వైద్య సాయం

బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి అనుమతి పత్రాలు అందజేసిన కొలన్ హన్మంత్ రెడ్డి
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఇద్దరికి ఆర్థిక చేయూత
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో నిధుల మంజూరు
ప్రజలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్, జూన్ 19 ( నమస్తే భరత్ ): ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు గొప్ప వరంగా నిలుస్తోందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపుతోందని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సాయిబాబా నగర్‌కు చెందిన అంబుగోల ప్రసాద్, బాచుపల్లి ప్రాంతానికి చెందిన మేకల రుద్రమదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స, శస్త్రచికిత్సల కోసం భారీ వ్యయం అవసరమవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొలన్ హన్మంత్ రెడ్డి వెంటనే స్పందించి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.6 లక్షల ఆర్థిక సాయం మంజూరు అయ్యేలా కృషి చేశారు. మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి అనుమతి పత్రాలను బాధితులకు కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వైద్య ఖర్చుల భారం కారణంగా ఎవరూ చికిత్సకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి, వారికి అవసరమైన సహాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



