ఆపద్బాంధవుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు యన్ హెచ్ యం ఉద్యోగుల ఫోరం కృతజ్ఞతలు
డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోతు చొరవతో 60 మంది పాలియేటివ్ కేర్ ఆయమ్మలకు 11 నెలల పెండింగ్ వేతనాల విడుదల
నమస్తే భారత్ :-మహబూబాబాద్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా లలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పాలియేటివ్ కేర్ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 60 మంది ఆయమ్మలు గత 11 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ సమస్యను జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల ఫోరం (యన్ హెచ్ యం ఎంప్లాయిస్ ఫోరం ) చైర్మన్ డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోతు ప్రత్యేక చొరవ తీసుకుని జూన్ నెలలో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (యన్ సి యస్ టి) సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న వేతన సమస్యను ఆయనకు వివరించారు.ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన జాటోత్ హుస్సేన్ నాయక్ సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, జాతీయ ఆరోగ్య మిషన్ కమిషనర్ మరియు మిషన్ డైరెక్టర్, డీఎంఈలకు నోటీసులు జారీ చేయించి, పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు.
దీంతో సంబంధిత అధికారులు స్పందించి, 11 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాల చెల్లింపునకు బడ్జెట్ విడుదల చేశారు. ఒక్కో ఆయాకు పెండింగ్ లో ఉన్న 11 నెలల వేతనం రూ.1,10,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 60 మంది ఆయమ్మల్లో చాలామందికి ఇప్పటికే వారి ఖాతాల్లో వేతనాలు జమ కాగా, మిగిలిన వారికి కూడా చెల్లింపులు జరుగుతున్నాయని యన్ హెచ్ యం ఉద్యోగుల ఫోరం చైర్మన్ డాక్టర్ కుమార్ నాయక్ తెలిపారు.ఈ సమస్య పరిష్కారానికి విశేష చొరవ చూపిన యన్ సి యస్ టి సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల ఫోరం చైర్మన్ డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోతు, వైస్ చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు, మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోని
పాలియేటివ్ కేర్ విభాగంలో పనిచేస్తున్న ఆయాలు ధరావత్ లక్ష్మీనాయక్,సంధ్యారాణి,భూక్యా రాజేశ్వరి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ, సుమారు 60 మంది పాలియేటివ్ కేర్ ఆయమ్మల వేతన సమస్య పరిష్కారమై వారి ఖాతాల్లో పెండింగ్ జీతాలు జమ కావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగులకు ఎలాంటి ఆపద వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు.



