ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeఎడిటోరియల్బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం ప్రజలను మోసం చేస్తున్న బీజేపీని గద్దెదించుదాం

బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం ప్రజలను మోసం చేస్తున్న బీజేపీని గద్దెదించుదాం

📰 Generate e-Paper Clip

బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం
ప్రజలను మోసం చేస్తున్న బీజేపీని గద్దెదించుదాం


సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఎం.డి. యూసఫ్‌
➤ కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
➤ కార్పొరేట్‌ ప్రయోజనాలకే బీజేపీ పెద్దపీట
➤ నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యుడిపై భారం
➤ మతం పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు
➤ విద్యార్థి, యువజన, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
➤ రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలి

జగద్గిరిగుట్ట, ఆగస్టు 14 ( నమస్తే భరత్ ): ప్రజలను మోసం చేస్తూ కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఎం.డి. యూసఫ్‌ పిలుపునిచ్చారు. సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా చేపట్టిన ప్రచార యాత్రకు ముగింపుగా కుత్బుల్లాపూర్‌ సిపిఐ సమితి ఆధ్వర్యంలో షాపూర్‌నగర్‌ బస్‌స్టాప్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని యూసఫ్‌ విమర్శించారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా కార్మికులు సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాల పేరుతో నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కొత్త లేబర్‌ కోడ్‌ల వల్ల కార్మికుల సమ్మె హక్కు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, ప్రమాద బీమా, కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. కార్పొరేట్‌, పారిశ్రామిక వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలను రూపొందిస్తూ కేంద్ర ప్రభుత్వం సామాన్యులు, కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తోందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినా, ఆచరణలో ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపారని విమర్శించారు. మతం, శ్రీరాముడి పేరు వంటి అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రజలను భావోద్వేగాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారని యూసఫ్‌ ఆరోపించారు. ప్రజలు ఇప్పుడు వాస్తవాలను గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఉమామహేష్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో వరుస విజయాలతో గర్వానికి గురైన బీజేపీ ప్రభుత్వం ప్రజలు తమను ప్రశ్నించరనే ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. విద్యార్థులు, యువత, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతమవుతున్నాయని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని, రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రచార యాత్రలు నిర్వహిస్తున్నామని ఉమామహేష్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పార్టీ కార్యకర్తలు మరింత విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఏరియా మండల కార్యదర్శి స్వామి అధ్యక్షత వహించారు. సహాయ కార్యదర్శులు హరినాథ్‌రావు, రాములు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌, ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు నర్సింహారెడ్డి, శాఖ కార్యదర్శి బక్కరి మల్లేష్‌, సిపిఐ నాయకులు శ్రీనివాస్‌, మల్లేష్‌, మహేందర్‌, రమేష్‌, ప్రసాద్‌ నాయక్‌, భీమేష్‌, కనకయ్య, కిష్టయ్య, వీరయ్య, మజ్జి గౌరీ, పవన్‌, భీమేష్‌ తదితరులతో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!