బోనాల వేడుకలకు నిజాంపేట్ సిద్ధం… ఘనోత్సవానికి సర్వం సిద్ధం

➤ ఆగస్టు 9న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి బోనాల మహోత్సవం
➤ గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలతో ఏర్పాట్లపై సమీక్ష
➤ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పకడ్బందీ చర్యలు
➤ సంప్రదాయబద్ధంగా, వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయం
నిజాంపేట్, ఆగస్టు 4 ( నమస్తే భరత్ ): నిజాంపేట్ గ్రామంలో ఆగస్టు 9 (ఆదివారం)న నిర్వహించనున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించేలా చేపట్టాల్సిన ఏర్పాట్లపై గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు విస్తృతంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ నరసింహారెడ్డి, కొలన్ శ్రీనివాస్ రెడ్డి, కొలన్ గోపాల్ రెడ్డి పాల్గొని, గ్రామ ప్రజలందరి సహకారంతో ఈసారి బోనాల ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆలయ పరిసరాల పరిశుభ్రత, భక్తులకు తాగునీటి వసతి, విద్యుత్ దీపాలంకరణ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతతో పాటు ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా చర్చించారు. బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని నిర్ణయించారు. గ్రామ ప్రజలందరూ ఉత్సవాల్లో భాగస్వాములై అమ్మవారి ఆశీస్సులు పొందాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ సమావేశంలో సాయిలు యాదవ్, కుమార్ యాదవ్, రాజమోహన్ రెడ్డి, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రవి యాదవ్, కె. లక్ష్మారెడ్డి, ప్రేమ్ కుమార్, జగన్ యాదవ్, నరసింహాచారి, కమ్మటి ఎల్లయ్య, కమ్మటి భరత్, కుమ్మరి బిక్షపతి, కుమ్మరి వెంకటేష్, కుమ్మరి కుమార్, బక్క చిన్న నరసింహ, దుర్గయ్య, మేకల నాగేష్, బక్క రాజు, గండని రాము, బైండ్ల గణేష్, ఆశి యాదయ్యతో పాటు నిజాంపేట్ గ్రామ పెద్దలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



