*ప్రైవేట్ పాఠశాలల పుస్తకాల దందాను ఆపాలి:మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బేగరి మహేష్*
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 14:రంగారెడ్డి జిల్లా: ప్రైవేట్ పాఠశాలల్లో కొనసాగుతున్న పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు, బ్యాగులు, షూస్ విక్రయాల దందాపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బేగరి మహేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ స్కూల్స్‌లో విద్యార్థుల తల్లిదండ్రులను బలవంతంగా స్కూల్ యాజమాన్యం సూచించిన షాపుల నుంచే పుస్తకాలు, స్టేషనరీ సామగ్రి కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్‌లో లభించే పుస్తకాల కంటే 30 నుంచి 60 శాతం వరకు అధిక ధరలకు విక్రయిస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని పేర్కొన్నారు. అదే విధంగా కొన్ని పాఠశాలలు తమ లోగోతో పుస్తకాలు ముద్రించి అధిక ధరలకు విక్రయిస్తున్నాయని, పాత పుస్తకాలను కూడా కొత్తవిగా చూపించి అమ్ముతున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి రూ.8,000 నుంచి రూ.15,000 వరకు పుస్తకాలు, నోట్‌బుక్స్, స్టేషనరీ పేరుతో అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మిషన్ లేని ప్రైవేట్ పాఠశాలలపై కూడా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రేపటి నుంచి అన్ని ప్రైవేట్ స్కూల్స్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ వసూళ్లు, పుస్తకాల దందాను అరికట్టాలని విద్యా అధికారులను కోరారు.ప్రైవేట్ పాఠశాలలు విద్యను అందించే కేంద్రాలుగా ఉండాలే గానీ వ్యాపార సంస్థలుగా మారకూడదని, విద్యను లాభార్జన సాధనంగా మార్చడం సమాజానికి హానికరమని అన్నారు. తల్లిదండ్రులు కూడా మేల్కొని తమ హక్కుల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

