ePaper
Friday, June 12, 2026
ePaper
Homeఎడిటోరియల్ధరల దెబ్బతో ప్రజల బతుకులు బరువెక్కాయి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణలో విఫలం: సీపీఐ

ధరల దెబ్బతో ప్రజల బతుకులు బరువెక్కాయి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణలో విఫలం: సీపీఐ

📰 Generate e-Paper Clip

ధరల దెబ్బతో ప్రజల బతుకులు బరువెక్కాయి

కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణలో విఫలం: సీపీఐ

కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా.. డీఆర్వోకు వినతి

పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిక

కుత్బుల్లాపూర్, జూన్ 10 ( నమస్తే భరత్ ): నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్ చార్జీలు, విద్యా–వైద్య ఖర్చులు నిరంతరం పెరుగుతూ సామాన్య ప్రజల జీవనాన్ని దుర్భరంగా మారుస్తున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఎస్. బోస్ విమర్శించారు. ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బుధవారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా డీఆర్వో మాలతికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వి.ఎస్. బోస్ మాట్లాడుతూ, 2014లో సుమారు రూ.410గా ఉన్న గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,150 దాటిందని, పెట్రోల్ ధర లీటరుకు రూ.70 నుంచి రూ.117కు చేరుకుందని పేర్కొన్నారు. డీజిల్, వంటనూనెలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పాలు, గుడ్లు, బియ్యం తదితర నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయని తెలిపారు. దీంతో మధ్యతరగతి, పేద కుటుంబాల నెలవారీ ఖర్చులు గత దశాబ్దంలో దాదాపు రెట్టింపు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ‘అచ్చే దిన్’, ‘అభివృద్ధి’ పేరుతో హామీలు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ధరల పెరుగుదలపై స్పందించడం లేదని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలు ప్రజలకు సబ్సిడీలు అందించడంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నాయని ఆరోపించారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోయినా మార్కెట్‌లో వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలోనూ ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తున్న వేళ కొద్దిమంది కార్పొరేట్ సంస్థల సంపద మాత్రమే పెరుగుతుండటం ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాలకు నిదర్శనమని అన్నారు. సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ మాట్లాడుతూ, ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ప్రచార ఆర్భాటాలకు, కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, రైతులకు గిట్టుబాటు ధరలు, వినియోగదారులకు సరసమైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్య, వైద్యం, విద్యుత్, రవాణా రంగాల్లో ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని, నిల్వదారులు, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన గేయాలు ఆకట్టుకున్నాయి. సీపీఐ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువజనులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోకపోతే మరింత ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని సీపీఐ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి. దామోదర్ రెడ్డి, డి.జి. సాయిలు గౌడ్, తోటపల్లి శంకర్, హరినాథ్ రావు, కె. స్వామి, టి. సత్యప్రసాద్, రచ్చ కిషన్, నిమ్మల నర్సింహా, యాదయ్య గౌడ్, కృష్ణ, లక్ష్మీ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి. లక్ష్మణ్, మండల కార్యదర్శులు, ప్రజానాట్యమండలి, మహిళా, గిరిజన, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులతో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!