భగత్ సింగ్ ఆశయాలను సాధించేందుకు యువత ముందుకు రావాలి
సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ భగత్ సింగ్ ఆశయాలను సాధించేందుకు యువత ముందుకు రావాలి
సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలోని కార్గిల్ సెంటర్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి.ఘనంగా.నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహోన్నత విప్లవ వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి, దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. భగత్ సింగ్ త్యాగం, ధైర్యం, దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.భగత్ సింగ్ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాకుండా, సమ సమాజ స్థాపన కోసం కలలు కన్న గొప్ప విప్లవకారుడని తెలిపారు. సమాజంలో నెలకొన్న అసమానతలు, దోపిడీ, వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. నేటి యువత భగత్ సింగ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధిలో, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, కార్మికులు, కర్షకుల సమస్యలను పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం ప్రజాస్వామ్య, లౌకిక, సమానత్వ విలువలను కాపాడుతూ ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని అన్నారు.భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవడమే కాకుండా, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎం.డి. అబ్దుల్ రషీద్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కొండ వెంకన్న, పి. వీరన్న, పి. కృష్ణ, సిహెచ్. రాజు, కే. వెంకన్న, సుధాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు



