ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeఎడిటోరియల్స్నాప్‌చాట్ మాయలో మహిళలు.. 40 తులాల బంగారం కాజేసిన కేటుగాళ్లు

స్నాప్‌చాట్ మాయలో మహిళలు.. 40 తులాల బంగారం కాజేసిన కేటుగాళ్లు

📰 Generate e-Paper Clip

స్నాప్‌చాట్ మాయలో మహిళలు.. 40 తులాల బంగారం కాజేసిన కేటుగాళ్లు

స్నాప్‌చాట్ వేదికగా మహిళలతో పరిచయాలు

విలాసవంతమైన కార్లతో కోటీశ్వరుడినంటూ నమ్మబలికిన నిందితుడు

ప్రేమ, స్నేహం పేరుతో నమ్మించి బంగారు ఆభరణాల చోరీ

ఇప్పటివరకు 20 మంది బాధితులను గుర్తించిన పోలీసులు

35–40 తులాల బంగారం దోచుకున్నట్లు నిందితుల అంగీకారం

మరో కొంతమంది బాధితులు ఉండొచ్చని పోలీసుల అనుమానం

పేట్ బషీరాబాద్, ఆగస్టు 14 ( నమస్తే భారత్ ): సోషల్ మీడియా యాప్‌ స్నాప్‌చాట్‌ను వేదికగా చేసుకుని మహిళలను పరిచయం చేసుకుని, వారి నమ్మకాన్ని చూరగొని విలువైన బంగారు ఆభరణాలను కాజేస్తున్న ఇద్దరు నిందితులను పేట్‌ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహం, పరిచయం పేరుతో మహిళలను ఆకర్షించి.. తాను ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తినని నమ్మించేందుకు అద్దెకు తీసుకున్న లగ్జరీ కార్లలో తిరుగుతూ నిందితుడు సాగర్‌ చౌదరి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, పేట్‌ బషీరాబాద్ సీఐ విజయ్‌ వర్ధన్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ అజయ్‌కుమార్, క్రైమ్‌ పోలీసుల ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు.

స్నాప్‌చాట్‌లో పరిచయం.. నమ్మకం కలిగించి:

సంగారెడ్డికి చెందిన సాగర్‌ చౌదరి అలియాస్‌ సాయి సునీల్‌ (25) స్నాప్‌చాట్‌ ద్వారా మహిళలకు పరిచయమయ్యేవాడు. అనంతరం వారితో తరచూ చాటింగ్‌ చేస్తూ సన్నిహితంగా మెలిగి వారి నమ్మకాన్ని పొందేవాడని పోలీసులు తెలిపారు. తన వద్ద భారీగా డబ్బు ఉందని నమ్మించేందుకు అద్దెకు తీసుకున్న ఖరీదైన కార్లను వినియోగించేవాడని పేర్కొన్నారు.

ఆభరణాలపై కన్ను:

మహిళల పూర్తి నమ్మకాన్ని సంపాదించిన అనంతరం వారి వద్ద ఉన్న బంగారు గొలుసులు, ఉంగరాలు తదితర ఆభరణాలను గుర్తించి.. వాటిని తెలివిగా కాజేసి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడని పోలీసులు తెలిపారు. అనంతరం తనకు సహకరించే రెండో నిందితుడు భరత్‌కుమార్‌కు చోరీ చేసిన బంగారాన్ని అప్పగించేవాడని వెల్లడించారు.

దొంగ బంగారానికి మార్కెట్‌ మార్గం:

రెండో నిందితుడు శివంగుళ భరత్‌కుమార్‌ (28) వ్యాపార అనుభవాన్ని ఉపయోగించుకుని దొంగిలించిన బంగారు ఆభరణాలను మార్కెట్‌లో విక్రయించేందుకు సహకరించేవాడని పోలీసులు తెలిపారు. ఈ విధంగా ఇద్దరూ కలిసి పలువురు మహిళలను మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

20 మంది బాధితుల గుర్తింపు:

పోలీసుల ప్రాథమిక విచారణలో ఇప్పటివరకు 20 మంది బాధితులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితులు సుమారు 35 నుంచి 40 తులాల వరకు బంగారు ఆభరణాలను కాజేసి విక్రయించినట్లు విచారణలో అంగీకరించినట్లు పేర్కొన్నారు.

మొబైల్‌ ఫోన్లు, ఆభరణాలు స్వాధీనం:

నిందితుల నుంచి బాధితులకు చెందిన బంగారు గొలుసులు, ఉంగరాలు తదితర ఆభరణాలతో పాటు నేరాలకు ఉపయోగించిన పలు మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆధారాల ఆధారంగా దర్యాప్తును మరింత విస్తరిస్తున్నట్లు తెలిపారు.

ఇంకెంత మందో..?

ఈ ముఠా చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల సోషల్‌ మీడియా ఖాతాలు, మొబైల్‌ ఫోన్లను పరిశీలిస్తూ మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. స్నాప్‌చాట్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో పరిచయం అయ్యే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!