గోల్డ్ లోన్ కేంద్రాల్లో ఆకస్మిక భద్రతా తనిఖీలు
మరిపెడ ఎస్‌ఐలు గండ్రాతి సతీష్, ప్రభాకర్ రెడ్డి
నమస్తే భారత్ :-మరిపెడ
ప్రజల ఆస్తుల భద్రతతో పాటు నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మరిపెడ పోలీసులు చేపడుతున్న చర్యలు ప్రశంసనీయంగా కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ నేరాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్న మరిపెడ పోలీసులు శుక్రవారం టౌన్‌లోని గోల్డ్ లోన్ ఫైనాన్సియల్ సంస్థలు, పాన్ బ్రోకర్స్, జ్యువెలరీ దుకాణాల్లో ఆకస్మికంగా భద్రతా తనిఖీలు నిర్వహించారు.మరిపెడ ఎస్‌ఐలు గండ్రాతి సతీష్, ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముతూట్, కీర్తన, శ్రీరామ్ ఫైనాన్స్ బ్రాంచ్ కార్యాలయాలతో పాటు పాన్ బ్రోకర్స్, జ్యువెలరీ షాపులను సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన అలారం సిస్టమ్, సీసీటీవీ కెమెరాల పనితీరు, కవరేజ్, భద్రతా ప్రమాణాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయా బ్రాంచ్ మేనేజర్లతో సమావేశమై గోల్డ్ లోన్ మంజూరు చేసే సమయంలో రుణగ్రహీతల పూర్తి వివరాలు, గుర్తింపు పత్రాలు, సమర్పించిన బంగారం యాజమాన్యాన్ని పూర్తిగా నిర్ధారించుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు గోల్డ్ లోన్ కోసం వచ్చినా లేదా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినా వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఆదేశించారు.ప్రజల భద్రతకు భంగం కలిగించే ఘటనలను ముందుగానే అరికట్టే లక్ష్యంతో మరిపెడ పోలీసులు చేపడుతున్న ఇలాంటి తనిఖీలు ప్రజల్లో భరోసా కల్పిస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపార సంస్థలు కూడా పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, సీసీటీవీ వ్యవస్థలు ఎల్లప్పుడూ పనిచేసేలా చూసుకోవాలని ఎస్‌ఐలు సూచించారు.



