మట్టేవాడలో ఘనంగా కొమురం భీం జయంతి వేడుకలు
గూడూరు, అక్టోబర్ 22(నమస్తే భారత్) : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టేవాడ గ్రామంలో ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ గూడూరు మండల అధ్యక్షుడు ముయ్యబోయిన వెంకన్న మాట్లాడుతూ.. కొమురం భీం 1901లో ప్రస్తుత తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతంలో గోండు గిరిజన కుటుంబంలో జన్మించారని తెలిపారు. ఆయనకు అధికారిక విద్య లేకపోయినా, జీవితంలో ఎదురైన అన్యాయాలు, గిరిజనులపై జరుగుతున్న దోపిడీ ఆయనను పోరాట యోధుడిగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.
‘జల్, జంగల్, జమీన్’ (నీరు, అడవి, భూమి) పై ఆదివాసీలకు హక్కులు కల్పించాలనే లక్ష్యంతో కొమురం భీం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించారని గుర్తుచేశారు. గిరిజనుల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ దొర బిజ్జా పొట్టయ్య, పటేల్ రేగ వెంకటేశ్వర్లు, మండల పీసా మొబిలైజర్ ఆగబోయిన సమ్మయ్య, పీసా కార్యదర్శి బిజ్జా నరసయ్య, ఆదివాసీ ఉపాధ్యాయులు రేగ పాపారావు, పూణెం భద్రయ్య, ముయ్యబోయిన వెంకన్న, రేగ వెంకన్న, రేగ సురేందర్, మేడ కళా వెంకట్, బిజ్జా రణధీర్, సోలం ప్రవీణ్, ఐలబోయిన భూపతిరావు, బొడ్డు రాములు, పూణెం సుధాకర్, శ్రీపతిరావు, పెనక అశోక్ తదితరులు పాల్గొన్నారు.



